పదేళ్లు అధికారంలో ఉండి ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం లేదంటారా?: మల్లు భట్టివిక్రమార్క

పదేళ్లు అధికారంలో ఉండి ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం లేదంటారా?: మల్లు భట్టివిక్రమార్క
  • పదేళ్లు పాలించారు కాబట్టి ఈ వ్యవహారంలో వారికి బాధ్యత ఉంటుందని వ్యాఖ్య
  • దేశ భద్రత కోసం, ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేస్తారన్న భట్టివిక్రమార్క
  • ప్రతిపక్ష నేతలను నిర్వీర్యం చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? అని ధ్వజం
  • ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని ఆగ్రహం

పదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్‌తో మాకేం సంబంధం అంటారా? అని బీఆర్ఎస్ నేతలపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. పదేళ్లు పాలించారు కాబట్టి ఈ వ్యవహారంలో వారికి బాధ్యత ఉంటుందన్నారు. దేశ భద్రత కోసం, ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేస్తారన్నారు. కానీ ప్రతిపక్ష నేతలను నిర్వీర్యం చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? అని ధ్వజమెత్తారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.

భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు? వ్యాపారులు ఏం మాట్లాడుకుంటున్నారు? అధికారులు ఏం మాట్లాడుకుంటున్నారు? జడ్జిలు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇలా అందరి జీవితాల్లోకి... వంటగదుల్లోకి... బెడ్రూంలలోకి వెళ్లి చూస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పౌరుల భద్రతకు పెను ప్రమాదమన్నారు. మీ రాజకీయ, వ్యక్తిగత అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత సమాచారం ఎలా వచ్చిందో విచారణలో తేలుతుందన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారన్నారు.
Mallu Bhatti Vikramarka, Phone Tapping Case, Congress