టీచర్లకు షాక్​

టీచర్లకు షాక్​
  • బదిలీలు, పదోన్నతులపై స్టే
  • వచ్చేనెల 14 వరకు ప్రక్రియ నిలిపివేత
  • కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో : స్పౌజ్​బదిలీలు, ఉపాధ్యాయుల పదోన్నతులు, ట్రాన్స్​ఫర్లపై పోరాటం చేసి కొంత క్లియరెన్స్​దక్కించుకున్న టీచర్లకు షాక్​ తగలింది. ఈ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే నిలిపి వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్చి 14 వరకు స్టే విధించింది. నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ పిటిషన్పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, ఉద్యోగ దంపతులు, గుర్తింపు యూనియన్​ నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వడం సరి కాదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీని మీద కౌంటరు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. చిన్న జిల్లాలు ఏర్పాటు కావడంతో  50 నుంచి 60 కిలోమీటర్ల పరిధి మాత్రమే ఉందని, దీంతో స్పౌజ్​ టీచర్లకు ఇబ్బందులు ఉండవని పిటిషనర్ల తరుపు న్యాయవాదులు వాదించారు. తెలంగాణలో గుర్తింపు పొందిన యూనియన్ల సంఖ్య పెరిగిందని, ప్రతి యూనియన్​నుంచి ఇద్దరికి ఓడీ చాన్స్​ ఇచ్చారని, వారికి అదనంగా పది పాయింట్లు చేర్చారని అభ్యంతరాలను వ్యక్తం చేశారు. 

ఇచ్చినట్టే ఇచ్చి
ఉపాధ్యాయ బదిలీలపై ముందు నుంచీ వివాదాలు వస్తూనే ఉన్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసనలు తెలిపారు. ఉపాధ్యాయ దంపతులు ప్రగతిభవన్​ను ముట్టగించారు. దీంతో నాలుగేళ్ల తర్వాత టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం అయింది. బదిలీలకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. రెండేళ్ల సర్వీస్ పూర్తయినవారే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో 317 జీఓతో ఇతర జిల్లాలకు బదిలీల అయిన ఉపాధ్యాయులు ఆందోళన బాటపట్టారు. తామంతా ఇతర ప్రాంతాలకు వెళ్లి యేడాదే అయిందని, ప్రస్తుత బదిలీలలో తమకు అవకాశం లేకుండా పోయిందని, నిబంధనలలో మార్పు చేసి తమకు కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొందరు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే విధించడంతో ప్రక్రియ మళ్లీ ఆగిపోయింది. 

ప్రక్రియ సాగిందిలా
రాష్ట్రంలో జనవరి 27 నుంచి టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 59,909 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమకూ అవకాశం ఇవ్వాలని కొందరు జీఓ 317 బాధిత టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. వారికీ బదిలీలకు అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. వారి కోసం ఈ నెల12 నుంచి 14 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. బుధవారం అర్థరాత్రితో గడువు ముగియనుంది. ఇప్పటివరకూ 13,904 మంది అప్లై చేసుకున్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఏకంగా 1104 దరఖాస్తులు రావడం గమనార్హం. ఈ లెక్కన బదిలీలకోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య 73,803కి చేరింది. ప్రస్తుతం మార్చి14 వరకూ బదిలీలపై స్టే ఉండటంతో, ఆ తర్వాతే నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఏప్రిల్​ వరకూ విద్యార్థులకు వరుస పరీక్షలు ఉండటంతో.. ఏప్రిల్ 25 నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలీడేస్ ప్రారంభం కానున్నాయి. దీంతో వేసవి సెలవులలోనే బదిలీల ప్రక్రియ చేయాలని భావిస్తున్నారు.