కొండగట్టుకు నేడు సీఎం | Mudra News

కొండగట్టుకు నేడు సీఎం | Mudra News
  • ప్రత్యేక పూజలు, ప్రగతి పనుల సమీక్ష
  • ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు కొప్పుల, గంగుల 
  • అష్ట దిగ్బంధంలో పుణ్యక్షేత్రం
  • ముందస్తుగా విపక్ష నేతల అరెస్టు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: 
తెలంగాణలోనే  ప్రసిద్ధిగాంచిన కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ బుధవారం సందర్శించనున్నారు. ఈ సందర్బంగా మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సుంక రవిశంకర్, ఎమ్మెల్సీ రమణ, జడ్పీ చైర్మన్ దావ వసంత, కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషాతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం తొమ్మిది గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి  9:40 నిమిషాలకు కొండగట్టుకు చేరుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వివిధ ప్రాంతాలను ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయితో కలిసి పరిశీలిస్తారు. జేఎన్టీయూ కళాశాలలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఒంటి గంటకు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు. సీఎం పర్యటన సందర్భంగా ఆలయంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచే పూజలు నిలిపివేశారు. భక్తులను పంపించి వేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులను పోలీసులు గుట్ట కిందికి పంపించారు. కొండగట్టుకు చేరుకునే దారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీఎం వచ్చి వెళ్లే వరకు  కొండపైకి ఎలాంటి ప్రైవేట్ వాహనాలు రాకుండా ఆంక్షలు విధించారు. 

అభివృద్ధి పనులు
కొండగట్టు అభివృద్ధి కోసం సీఎం రూ.100 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిధులతో కొండగట్టును కూడా యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి నాలుగు రోజులుగా కొండగట్టులోనే ఉండి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. భక్తులకు వసతి గృహాలు, విమాన గోపురాలతో రాతి కట్టడాలు, మందిరానికి నాలుగు వైపులా రాజగోపురాలు, అభిషేక మండపం, సత్యనారాయణ స్వామి మండపం నిర్మించాలని నిర్ణయించారు. ధర్మ దర్శనం, ప్రత్యేక దర్శనం క్యూ కాంప్లెక్స్ తోపాటు ధర్మశాల గదులను నిర్మించాలని కూడా యోచిస్తున్నారు. వీఐపీ హాలు, డార్మెట్ హాలు, నిత్యాన్నదాన సత్రం, ప్రసాదాల తయారు గదినీ నిర్మించనున్నారు. రోడ్లు,  డ్రైనేజీల నిర్మాణం, విద్యుత్ దీపాలతో పాటు కొండపైకి నాలుగు లేన్ల రహదారి నిర్మాణం, అర్చకులకు వసతి గృహాలు,  ఆలయ ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేశారు . 

బస్సు ప్రమాద బాధితులకు అండ?
రాష్ట్రంలోని అతిపెద్ద బస్సు ప్రమాదం కొండగట్టులో జరిగింది. 2018 సెప్టెంబర్ 11న కొండగట్టు ఘాట్ రోడ్డు మీద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 68 మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. పలువురు వికలాంగులుగా మారారు. ప్రభుత్వం మరణించినవారికి రూ. పది లక్షలు, గాయపడినవారికి రూ. మూడు లక్షల చొప్పున సాయమందించింది. చనిపోయినవారి కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఇప్పటివరకు ఆ డిమాండ్ నెరవేరలేదు. అతి పెద్ద ప్రమాదం కావడంతో సీఎం కేసీఆర్ బాధితులను పరామర్శిస్తారని భావించారు. కానీ, సీఎం రాలేకపోయారు. సంఘటన జరిగిన నాలుగున్నరేండ్ల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టుకు వస్తుండటంతో  బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కోసం ఏదైనా ప్రకటన చేస్తారేమోనని బాధిత కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నేతల అరెస్టు
సీఎం పర్యటనను పురస్కరించుకొని జగిత్యాల ప్రాంతంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు సీఎంను అడ్డుకుంటారన్న సమాచారం మేరకు ఆ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.