బీబీసీలో ఐటీ సోదాలు

బీబీసీలో ఐటీ సోదాలు
  • ఏకకాలంలో 20 చోట్ల తనిఖీలు
  • కంప్యూటర్లు, ఫోన్ల నుంచి సమాచార సేకరణ
  • పన్నులు ఎగవేశారంటున్న అధికారులు
  • మోడీపై డాక్యుమెంటరీ రూపొందించినందుకే దాడులు
  • మండి పడుతున్న విపక్షాలు
  • తీవ్రంగా ఖండించిన ఐజేయూ,  ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా

న్యూఢిల్లీ: 
బీబీసీ కార్యాలయాల మీద మంగళవారం జరిగిన దాడులు కలకలం రేపాయి. ఢిల్లీ, ముంబై  సహా 20 ప్రాంతాలలో  ఐటీ అధికారులు సోదాలు చేశారు. అయితే, ఇవి దాడులు కాదని కేవలం ఆర్థిక లావాదేవీలలో అవకతవకల కారణంగా సోదాలు మాత్రమే నిర్వహించామని ఐటీ అధికారులు చెబుతుండటం విశేషం. 70 మంది ఐటీ శాఖాధికారులు ఉదయమే న్యూఢిల్లీ బీబీసీ  కార్యాలయం అకౌంట్స్​, ఫైనాన్స్​ విభాగాలలో సోదాలు నిర్వహించారు. అక్కడ పని చేస్తున్నవారి మొబైల్​ఫోన్లు, ల్యాప్​ట్యాప్​లు, కంప్యూటర్లను పరిశీలించారు. హార్డడిస్క్​ల నుంచి సమాచారాన్ని సేకరించారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న బీబీసీ కార్యాలయాలలోనూ తనిఖీలు జరిగాయి. మీడియా కార్యాలయంలో సోదాలు జరుగుతాయన్న విషయాన్ని భారత ప్రభుత్వం ముందుగానే బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేసిందని సమాచారం. 
బీబీసీ ఆర్థిక లావాదేవీలలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయని ఐటీ అధికారులు చెబుతున్నారు. పన్నులను ఎగవేసినట్లు సమాచారం ఉందని అంటున్నారు. విదేశీ నిధులను రప్పించుకొని దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ వాటికి పన్ను కట్టలేదని పేర్కొంటున్నారు. బీబీసీ కార్యాలయాల నుంచి తాము ఏమీ తీసుకువెళ్లడం లేదని, సమాచారాన్ని మాత్రం సేకరించి తిరిగి పరికరాలను తిరిగి సిబ్బందికి అప్పజెప్పి వెళతామని స్పష్టం చేశారు.
 
దేశవాసులు ముక్త కంఠంతో ఖండించాలి
బీబీసీ కార్యాలయాల మీద ఐటీదాడులపై విపక్షాలు గుర్రుమంటున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించింది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్నే రేపింది. అది ఆయన ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉండడంతో నే బీజేపీ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యున్నత మీడియా సంస్థ బీబీసీపై కక్ష కట్టిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటివరకూ ఏ మీడియా రంగాన్నీ టచ్​ చేయని సంస్థలు ఇప్పుడు బీబీసీని మాత్రమే టార్గెట్ చేయడానికి​మోడీపై డాక్యుమెంటరీయే కారణమని అంటున్నాయి. ముమ్మాటికి ఇది మీడియా రంగంపై దాడిగానే భావించాల్సి ఉంటుందని మండిపడుతున్నాయి. నోటీసులు ఇవ్వకుండానే అత్యున్నత మీడియా సంస్థపై దాడులు నిర్వహించడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని చెబుతున్నాయి. ఈ చర్యను దేశమీడియా, దేశవాసులు, పార్టీలు ముక్తకంఠంతో  ఖండించాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత జైరాం రమేశ్ అన్నారు. బీజేపీ గొంతునొక్కే చర్యలు మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీపై రూపొందించిన డాక్యుమెంటరీని నిలిపివేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగాయని ప్రతిపక్ష నేతలు అంటుంటే ‘అబ్బే అదేం లేదు బీబీసీ ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని‘ పలువురు బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.

ముమ్మాటికి ఇది కక్ష సాధింపే: ఐజేయూ 
హైదరాబాద్, చండీగఢ్:
ఢిల్లీ, ముంబై నగరాలలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ అధికారులు జరిపిన దాడులను ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. సర్వే పేరుతో మీడియా సంస్థ మీద దాడులు జరిపారని ఐజేయూ అధ్యక్షుడు కె.  శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ జనరల్ బల్వీందర్ సింగ్ జమ్ము ఆరోపించారు. కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. పాలనా వ్యవహారాలలో  ప్రభుత్వం చేస్తున్న తప్పులను విమర్శించిన వారిపై ప్రభుత్వ ఏజెన్సీల చేత దాడులు జరిపిస్తూ బెదిరింపులకు పాల్పడటం సాధారణమైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ లో 2002లో జరిగిన మతకలహాలపై బీబీసీ డాక్యుమెంటరీని విడుదల చేసిన తర్వాత ప్రభుత్వ ఏజెన్సీని ఉపయోగించి బెదిరింపులకు పాల్పడటం శోచనీయమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గల ఒక వార్తా సంస్థ పై ఇటువంటి దాడులు చేయడం అంతర్జాతీయ సమాజంలో భారత ప్రతిష్టను దిగజార్చుతుందని వ్యాఖ్యానించారు. ఇకనైనా మీడియా సంస్థలపై దాడులకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు. 

ఇది అసహనానికి నిదర్శనం
న్యూఢిల్లీ: సర్వేల పేరుతో బీబీసీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ విడుదల చేసిన కొద్ది వారాలలోపే ఇటువంటి దాడులు జరగడం కక్ష సాధింపు చర్య మాత్రమేనని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో విమర్శించింది.