సోదరీమణులకు సాగరన్న చీరల కానుక పంపిణీ షురూ

సోదరీమణులకు సాగరన్న చీరల కానుక పంపిణీ షురూ

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల నియోజకవర్గంలో కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బతుకమ్మ చీరలు పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గురువారం రాఖీ పర్వదినం పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చీరల పంపిణీ ప్రారంభించారు. బతుకమ్మ పండుగ ఇంకా కొద్దీ రోజుల్లో ఉన్నప్పటికీ ముందస్తుగా చీరలు పంచిపెట్టారు. తన నివాస గృహంలో తొలిరోజు 13 మందికి చీరలు అందజేశారు. శుక్రవారం దండెపల్లి మండలం తాళ్ల పేట నుంచి పూర్తిస్థాయిలో పంపిణీ దశల వారిగా చేపట్టనున్నారు. ఈ సందర్భంగా సురేఖ మీడియా తో మాట్లాడుతు, ప్రేమ్ సాగర్ రావు ఇచ్చిన హామీ మేరకు బతుకమ్మ కానుకగా చీరలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దాదాపు లక్ష మంది మహిళలకు చీరలు ఇవ్వాలని సంకల్పించినట్లు తెలిపారు. మహిళలు, అన్నివర్గాల ప్రజలు వచ్చే ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావును ఆదరించాలని కోరారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటక రాష్ట్రం తరహాలో హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కర్ణాటక లో ఐదు ప్రధాన హామీల్లో నాలుగు అమలు చేసారని తెలిపారు. రాష్ట్రం ప్రగతి పథంలో పయనించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి లో వెనుకపడిందని విమర్శించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు లతో ప్రజలకు ఒరిగింది ఏమి లేదని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన నిరుద్యోగ భృతి, కోటి ఎకరాలకు సాగునీరు, దళితులకు మూడెకరాల సాగు భూమి, దళితుడు ముఖ్యమంత్రి, ఇంటికో ఉద్యోగం తదితర హామీలు నీటి మూటలే అయ్యాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికార పీఠం అధిరోహించగానే ఎన్నికల హామీలను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని పొందుతామని సురేఖ ధీమా వ్యక్తం చేశారు.