Gundlakamma Reservoir: గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో కొట్టుకుపోయిన రెండో గేటు

Gundlakamma Reservoir: గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో కొట్టుకుపోయిన రెండో గేటు
  • మిగ్‌జాం కారణంగా రిజర్వాయర్‌లోకి ప్రవాహం
  • తుప్పుపట్టిన మరో గేటులో కొంత భాగం కొట్టుకుపోయిన వైనం
  • సముద్రంలోకి వృథాగా పోతున్న నీరు

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబుల్‌రెడ్డి జలాశయానికి చెందిన రెండో గేటు అడుగుభాగం కొట్టుకుపోయింది. ఇప్పటికే ఓ గేటు కొట్టుకుపోయి ఏడాదికి పైగా గడిచిపోగా శుక్రవారం రాత్రి 8.45 గంటల ప్రాంతంలో మరో గేటు విరిగి కొట్టుకుపోయింది. దీంతో, రిజర్వాయర్‌లోని నీళ్లు సముద్రం పాలవుతున్నాయి.
  
గుండ్లకమ్మ జలాయశం కింద కుడి, ఎడమ కాలువల పరిధిలో 80 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. రిజర్వాయర్‌లో చేపల వేటపై 2 వేలకు పైగా మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. గుండ్లకమ్మ పూర్తి సామర్థ్యం 3.8 టీఎంసీలు కాగా గతేడాది ఆగస్టులో 3వ గేటు కొట్టుకుపోయే నాటికి జలాశయంలో 3 టీఎంసీల నీళ్లున్నాయి. గేటు కొట్టుకుపోయాక రిజర్వాయర్ లోని 1.5 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది. 

మరమ్మతులకు మొత్తం జలాశయం ఖాళీ చేయాలని ఇంజినీర్లు అప్పట్లో సూచించారు. తాత్కాలిక రిపేర్ల తరువాత రిజర్వాయర్‌లో నీటి నిల్వను 1.7 టీఎంసీలకు పరిమితం చేశారు. ఇక మిగ్‌జాం తుపాను తరువాత ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండటంతో జలాశయంలోకి 2.5 టీఎంసీల నీరు చేరింది. అయితే, పైనుంచి ప్రవాహం ఎక్కువ కావడంతో అప్పటికే తుప్పుపట్టి ఉన్న రెండో గేటు అడుగు భాగం కొంత శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది.