బాధలో వున్న ప్రజల గొంతుకనవుతా!

బాధలో వున్న ప్రజల గొంతుకనవుతా!
  • మల్కాజిగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: తెలంగాణ ఉద్యమనేతగా నేనేం చేశానో ప్రజలందరికీ తెలుసునని, అదే స్ఫూర్తితో బాధలోవున్న ప్రజలందరి గొంతుకనవుతానని, మన ప్రాంత సమస్యలను పార్లమెంటులో ప్రతిధ్వనించేలా చేస్తానని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం ఉదయం బోడుప్పల్ లోని ఆకృతి టౌన్ షిప్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నివాసితులను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా బోడుప్పల్ ప్రాంతంలో వక్ఫ్ పేరుతో పలు సర్వేనెంబర్ల భూముల క్రయ, విక్రయాలు నిలిపివేసిన విషయమై ఆయన ప్రస్తావించారు. ఆకృతి టౌన్ షిప్ భూముల సర్వేనెంబర్లు వక్ఫ్ బోర్డు ఆధీనంలోని భూముల సర్వే నెంబర్లు కలిగివున్నాయని గత రెండు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

     కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించి తీరాల్సిన అవసరం ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాల్సిన అవసరం ఈ దేశానికి చాలావుందని పేర్కొన్నారు. ప్రధానిగా 2014లో నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన నాటికి ప్రపంచస్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కడో పదో స్థానంలో వుండేదని, ఈ పదేళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను అయిదో స్థానంలో నిలిపిన ఘనత భారతీయ జనతా పార్టీదేనని, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కృషి వల్లే ఇది సాధ్యమయ్యిందని అన్నారు. దేశంలో ప్రముఖులకు వైద్య మందించే అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఆస్పత్రులు దేశంలో మూడంటే మూడే వుండేవని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 16 కొత్త ఎయిమ్స్ ను ప్రారంభించిందని అన్నారు. గ్రామీణ ప్రాంత నిరుపేద మహిళలు బహిర్భూమికి చెంబును తీసుకెళ్తే దౌర్భాగ్య స్థితి నుంచి కాపాడి మహిళ గౌరవాన్ని నిలిపిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోదీ దని ఆయన సేవలను శ్లాఘించారు. దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట మత ఘర్షణలు, టెర్రరిస్టు దాడులతో అతలాకుతలమైన పరిస్థితి నుంచి శాంతిని నెలకొల్పడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. అంతర్జాతీయస్థాయిలో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన భారతీయ జనతా పార్టీని మనమంతా బలపర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు మీరంతా ఓటేసి కేంద్రంలో మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీని గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి బోడుప్పల్ బీజేపీ అధ్యక్షుడు గోనె శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఆకృతి టౌన్ షిప్ ప్రతినిధులు ఆయితు శ్రీనివాస్, బండారు కిశోర్ గౌడ్, అంతం లింగారెడ్డి, సాధుల రఘురాజ్, ఇమ్మడి సుధాకర్, లక్ష్మణ్ కోటి, రాజుభాయ్ తదితరులు వక్ఫ్ బోర్డు సమస్యను పరిష్కరించాలంటూ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు ఒక మొమొరాండం సమర్పించారు. కార్యక్రమంలో బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.