వైభవంగా ఏడుపాయల జాతర ప్రారంభం

వైభవంగా ఏడుపాయల జాతర ప్రారంభం
  • అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్, కలెక్టర్ రాహుల్ దంపతులు
  • భక్తులకు ఎలాంటి ఇబ్బందలు కల్గకుండా చూడాలి

ముద్ర ప్రతినిధి, మెదక్:తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ ఏడుపాయల వనదుర్గ మాత మహా జాతర వైభవంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు, శివాని దంపతులు, కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.   ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆది యోగి ఉత్సవ మూర్తి వద్ద జ్యోతి ప్రజ్వలనచేసి జాతర ప్రారంభించారు. ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఉచిత బస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేయగా కమిటీ చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్ రెడ్డిలు శాలువాతో ఎమ్మెల్యే, కలెక్టర్ ను సత్కరించారు. అడిషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్థానిక ఎంపిపి చందన ప్రశాంత్ రెడ్డిలు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. మరో అదనపు కలెక్టర్ రమేష్, ఆర్డివో రమాదేవి అమ్మవారిని దర్శించుకుని జాతర ఏర్పాట్లు పర్యవేక్షణ చేశారు. 

ఈ సందర్బంగా విలేకరుల సమావేశంలో  ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎన్నడూ లేని విధంగా ఏడుపాయల జాతర ఉత్సవాలను ఈ సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం కోటి రూపాయలతో మమ అనిపించిన ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం నేడు రెండు కోట్ల రూపాయలతో అంగరంగ వైభవంగా ఏడుపాయల జాతర ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కోన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో జాతరలో ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

  

మొదలైన భక్తుల రాక

ఉదయం నుండే భక్తుల రాక మొదలైంది. మంజీరా నదీ పాయల్లో భక్తులు పుణ్య స్నానమాచరిస్తున్నారు. పెద్ద ఎత్తున దుకాణాలు వెలిశాయి. ఆర్టీసీ వందలాదిగా ప్రత్యేక బస్సులు నడుపుతోంది.