మెదక్ జిల్లాలో ప్రశాంతం

మెదక్ జిల్లాలో ప్రశాంతం
  • 80.31 శాతం పోలింగ్ 
  • మెదక్ లో 81.72, నర్సాపూర్ లో 78.89 శాతం 
  • ఓటేసిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లాలో స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు 80.31 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ సెగ్మెంట్ లో 81.72 శాతం, నర్సాపూర్ లో 78.89 శాతం పోలింగ్ నమోదైనట్లు మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. నియోజకవర్గంలో  మూడు, నాలుగు చోట్ల ఈవిఎంలు మొరాయించాయి. పాపన్నపేట మండలం ఎల్లాపూర్, మిన్ పూర్, మెదక్ మండలం పాతూరు, రామాయంపేట, అక్కన్నపేటలో ఈవిఎంల కారణంగా ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అనేక చోట్ల ఉదయం 8 గంటల నుండి ఓటర్లు బారులు తీరారు.
మెదక్ కలెక్టర్ రాజర్షి షా కలెక్టర్ నివాసం హవేలీ ఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండా  ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం 211లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మెదక్ మండలం మాచవరం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెదక్ పట్టణం బాలుర జూనియర్ కళాశాలలో జిల్లా అదనపు ఎస్.పి  ఎస్.మహేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల సమీపంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామంలో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం లింగంపల్లి తండాలో బిఆర్ఎస్ అభ్యర్థి సునీతా రెడ్డి కుమారుడు శశిధర్ రెడ్డి కుమారుడి కారుపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయగా అద్దాలు పగిలి పోవడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 
ఓటేసిన ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు
మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి ఎం. పద్మ దేవేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వగ్రామం రామాయంపేట మండలం కోనాపూర్ లో ఓటు వేశారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం హవెలి ఘనపూర్ మండలం కూచన్ పల్లిలో ఓటేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి స్వగ్రామం కౌడిపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.  మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ సతీమణి శివానితో కలిసి చిన్న శంకరంపేట్ మండలం కొర్విపల్లిలో ఓటేశారు. బిజెపి అభ్యర్థి పంజా విజయ్ కుమార్ నిజాంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి యూసుఫ్ పేటలో ఓటేశారు.
  నర్సాపూర్ బిఆర్ఎస్ అభ్యర్థి సునీతా రెడ్డి స్వగ్రామం శివ్వంపేట మండలం గోమారంలో ఓటేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డిలు మసాయిపేటలో ఓటేశారు. బిజెపి అభ్యర్థి మురళీ యాదవ్ నర్సాపూర్ లో ఓటు వేశారు.  జిల్లా కలెక్టర్ రాజర్షి షా పోలింగ్ సరళి ఇప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తూ ఏర్పాటు చేశారు. పార్టీ అభ్యర్థులు, వారి ఏజెంట్ లు పోలింగ్ కేంద్రాలు సందర్శించి సరళి తెలుసుకున్నారు.
మోడల్ కేంద్రాలు
మెదక్, నర్సాపూర్ నియోజకవర్గంలో మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆకర్షణీయంగా అలంకరించారు. నియోజకవర్గంలో 5 మహిళా, 5 మోడల్, 1 వికలాంగుల పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. మొదటి సారిగా ఓటు హక్కు వచ్చిన యువతి యువకులు ఉత్సాహంగ్ ఓటేశారు. మొదటిసారి ఓటేయడం అనందంగా ఉందని పేర్కొన్నారు