పదేండ్లలో కేసిఆర్ నీళ్లివ్వమంటే.. కన్నీళ్లు మిగిల్చిండు – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

పదేండ్లలో కేసిఆర్ నీళ్లివ్వమంటే.. కన్నీళ్లు మిగిల్చిండు – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • బ్రహ్మణవెల్లంల నా బలం, బలగం, పుట్టిన ఊరు ప్రజల అభిమానానికి పులకించిన మంత్రి
  • నా తల్లి జన్మనిస్తే.. నాయకునిగా నాకు బ్రతుకును ఇచ్చిన నేల బ్రహ్మణవెల్లంల
  • కన్న ఊరికి ఎంత చేసినా తక్కువేనంటూ భావోద్వేగం
  • బ్రహ్మణవెల్లంల లో 200 మందికి మూడు ఎకరాల్లో ఇండ్లు కట్టించే బాధ్యతనాది
  • నా శేషజీవితం మొత్తం బ్రహ్మణవెల్లంలకు అంకితం...
  • రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం...
  • రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నల్గొండ:కన్నతల్లిని కలిసినప్పుడు, పుట్టిన ఊరికి వచ్చినప్పుడు కలిగే ఆనందం ప్రపంచంలో మరెక్కడా దొరకదని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో తన స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన కోమటిరెడ్డికి బ్రహ్మణవెల్లంల గ్రామస్తులు అడుగడుగున నీరాజనాలు పలికారు.

అనంతరం గ్రామంలో రూ. 30 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న నల్గొండ – బ్రహ్మణవెల్లముల, రూ. 25 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న బ్రహ్మణవెల్లముల- చిట్యాల రోడ్డుకు, రూ. 12 కోట్ల రూపాయల నిధులతో బ్రహ్మణవెల్లముల గ్రామంలో రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అంతకుముందు బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో నిరుపేద దంపతులు దామెర చంద్రమ్మ వెంకటయ్యలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే పథకం చేపట్టిన వెంటనే నా సొంత గ్రామంలో చంద్రమ్మ అనే పేద మహిళలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. బ్రహ్మణవెల్లంల నా బలం, నా బలగం మంత్రిపదవి చేపట్టిన వెంటనే బ్రహ్మణవెల్లంలకు రావాలని అనుకున్నప్పటికి.. రాష్ట్ర మంత్రిగా అనేక సమస్యలు పరిష్కరించాల్సి రావడం వల్ల రావడం లేటయ్యింది.. కానీ మీ అభిమానం తగ్గలే.. మీ ప్రేమ తగ్గలే.. మీ అప్యాయత తగ్గలేదు అంటూ గ్రామస్తులతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. బ్రహ్మణవెల్లంల నన్ను నాయకుడిగా తీర్చిదిద్దింది. నా తల్లి జన్మనిస్తే.. నాయకునిగా నాకు బ్రతుకును ఇచ్చిన నేల బ్రహ్మణవెల్లంల అంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

నేను అసెంబ్లీలో, పార్లమెంట్ లో ప్రమాణస్వీకారం చేశాక సీట్లో కూర్చున్నప్పుడునా కన్న తల్లితండ్రుల్ని, బ్రహ్మణవెల్లంలను యాదిచేసుకొని కూర్చీలో కూర్చుంట అది నా సెంటిమెంటని, ఈ గడ్డ మహామహులను ఎదిరించి నల్లగొండ ఫ్లోరైడ్ మీద ఉద్యమించే శక్తిని ఇచ్చింది. తెలంగాణ కోసం పార్లమెంట్ లో పోరాడే బలాన్ని అందించింది ఈ నేల.. కృష్టానది నీళ్ల కోసం.. గొంతెత్తే గళాన్ని తయారుచేసిన త్యాగం ఈ ఊరు.. ప్రజల కోసం మంత్రి పదవుల్ని సైతం విసిరికొట్టే ఆత్మగౌరవ పతాకను అందించిన ఊరు.. నా బ్రహ్మణవెల్లంల. నేను ఎక్కడున్నా.. బ్రహ్మణవెల్లంల బిడ్డనే.. మీరు ఆశీర్వదించి పంపితే.. ఇప్పటిదాక నా బాధ్యతలన్ని సక్రమంగా నిర్వర్తించి బ్రహ్మణవెల్లంలకు మంచిపేరు తీసుకొచ్చా.. కానీ ఇవ్వాల మీకు ఒక మాట చెప్తున్నా.. బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతీ ఎకరాకు సాగునీళ్లివ్వడం.. నా శేషజీవితం మొత్తం బ్రహ్మణవెల్లంలకు అంకితం చేయడం..

ఈ మట్టి కోసం, ఈ ఊరు కోసం, మీ అందరి కోసం నేను ఏం చేసినా తక్కువే అనుకుంటా.. మీ మనిషిగా ఉంటా.. మీ కష్టసుఖాల్లో తోడుంటా.. అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ మీ వెంకన్నగానే ఉంటా.. “నా గుండెనిండా బ్రహ్మణవెల్లంల ఉంటది – నా మనసునిండా ఈ మట్టివాసన ఉంటది” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం నల్గొండ పట్టణం చేరుకొని మన్యంచెల్కలో జిల్లా జైలు పక్కన రూ. 1.43 కోట్ల నిధులతో నిర్మిస్తున్న అర్భన్ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తదుపరి సాగర్ రోడ్డు వద్ద ఎస్.ఎల్.బీ.సీ క్యాంపు నందు జి.కె.గూడెంలో 11 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ ఛీఫ్ ఇంజనీర్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపనలు చేశారు. 18 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ కు పేరొస్తదోనని కేసీఆర్ నిధులు ఇవ్వలేదు. వచ్చే వానాకాలం పంట వరకు ప్రాజెక్టు కింద పెండింగ్ లో ఉన్న అన్ని కాలువలు తవ్విస్తా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ను పూర్తి చేయిస్తా గ్రామానికి చెందిన 200 మంది పేదలకు మూడు ఎకరాలలో ఇల్లులు కట్టించే బాధ్యత నాది, గ్రామంలో ఆసుపత్రిని కూడా నిర్మాణం చేయిస్తా బ్రాహ్మణ వెల్లెల్ల గ్రామంలో ప్రతి మహిళా సంఘానికి కోటి రూపాయలు ఇప్పిస్తా సంవత్సరానికి 20వేల కోట్ల రూపాయలతో ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు మంజూరు చేసి మహిళలని లక్ష్యాధికారులను చేయాలనేది ముఖ్యమంత్రి, మేము కలిసి నిర్ణయం తీసుకున్నాం.

మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాము. కానీ కేసీఆర్ చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో ప్రతి ఇంటి పై సోలార్ ప్యానల్స్ పెట్టి సోలార్ పవర్ వాడే గ్రామంగా తీర్చిదిద్దుతానని బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో త్వరలోనే కెనరా బ్యాంకు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం, నల్గొండ జిల్లా పరిషత్తు చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నల్గొండ ఆర్డీవో రవి, ఆర్అండ్ బీ ఎస్.ఈ. రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.