ప్రజా ప్రభుత్వంలో అధికారుల అలసత్వం ..

ప్రజా ప్రభుత్వంలో అధికారుల అలసత్వం ..
  • జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అధికారుల ఇష్టారాజ్యం 
  • విధులకు రోజు ఆలస్యమే అయిన ప్రశ్నించే వారే లేరు 

ముద్ర ప్రతినిది, జగిత్యాల: ప్రస్తుత ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని... ప్రజలు మార్పు కోరుకున్నారని.. తెలంగాణా రాష్ట్రంలో ప్రజా పాలనే కొనసాగుతుందని సియం రేవంతు రెడ్డి పేర్కొంటుంటారు. కాని అధికారుల తీరు అందుకు విరుద్ధమనే చెప్పాలి.  ప్రభుత్వం మారిందే తప్ప అధికారుల తీరు మారలేదు ... అధికారులు కూడా  తామెందుకు మారాలి అనుకుంటున్నట్లుగా ఉంది.. జగిత్యాల జిల్లా విద్యాశాఖ అధికారుల, ఉద్యోగుల తీరు. సాధారణంగా జిల్లాలోని ఇతర కార్యాలయలలో జిల్లా కలెక్టర్ వస్తున్నారు అంటే విధులకు వచ్చే సమయానికంటే ఓ 5 నిమిషాలు ముందుగానే హాజరు అవుతారు.  అదే జిల్లా  కలెక్టర్ ఉండే కలెక్టర్ కార్యాలయ సముదాయలో ఉండే కొన్ని కార్యాలయాల ఉద్యోగులకు అసలు భయమే లేదు ... వారు  ఎప్పుడయినా రావచ్చు ఎప్పుడయినా పోవచ్చు వారిని వారించే వారే లేరు. కలెక్టరేట్ లోని జిల్లా విద్యశాఖ కార్యాలయం అందుకు ఓ నిదర్శనం..

ఆ కార్యాలయంలో అధికారులు గాని, ఉద్యోగులు కాని ఉదయం 10.30 వరకు ఎప్పుడు రారు.. వారు కార్యాలయానికి రావాలి అనుకుంటే ఉదయం 11 గంటల తర్వాతే... వాచ్చాక ఓ గంట సమయం గడిపి మధ్యలో టీ స్నాక్స్ పేరుతో అరగంట నుంచి గంట బయట గడుపుతారు మళ్ళీ సాయంత్రం 5 గంటల కంటే ముందే వెళ్ళిపోతుంటారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై శుక్రవారం ముద్ర  జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని విజిట్ చేయగా అసిస్టెంట్ డైరెక్టర్, సూపరిండెంట్ తో పాటు పలువురు సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సిబ్బంది 50 శాతం  10.45 నుంచి 11 గంటల వరకు విధులకు హాజరు కాలేదు. దీనిపై హాజరైన సీనియర్ ఉద్యోగులను సమాచారం అడగగా తమకేమ తెలియదని పేర్కొన్నారు. ఇదే విషయమై జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డిని సెల్ ఫోన్ లో  సంప్రదించే  ప్రయత్నం చేయగా డీఈవో స్పందించలేదు. ప్రజా ప్రభుత్వం అంటే సమయపాలన పాలిటించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని,  విధులకు ఇష్టానుసారంగా వచ్చి ఇష్టానుసారంగా  వెళ్లడం కాదని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అయితే మూడు రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా, హాల్ టికెట్స్ సంబధిత సమస్యలఫై కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి అధికారులు అందుబాటులో లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లారు. జిల్లా స్థాయి అధికారులు కూడా ఫోన్ చేస్తే స్పందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి విధులకు ఆలస్యంగా హాజరవుతున్న అధికారులపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.