BREAKING: రైతు ఉసురు తీసిన రుణభారం
ముద్ర, తెలంగాణ బ్యూరో: ఎన్నో ఆశలతో చేసిన సేద్యం చివరికి అప్పులే మిగిల్చింది. పంట నష్టాలు పది లక్షల రూపాయల దాకా అప్పులు మిగల్చడంతో, రుణ భారం మోయలేని ఆ రైతు దంపతులు తీవ్ర మనస్తాపానికి గురై పురుగుమందు తాగారు. ఇద్దరిలో భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోగా, భర్త మాత్రం ఆమెను ఒంటరిని చేసి ప్రాణాలొదిలాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లి గ్రామానికి చెందిన పూసల మధుసూదన్ పంట మిగిల్చిన అప్పులతో ప్రాణాలు తీసుకున్నాడు. దంపతులిద్దరూ ఈనెల 14న పొలం వద్దే పురుగుమందు తాగారు. విషయం తెలుసుకున్న బంధువులు వారిరువురినీ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. మధుసూదన్ భార్య సంధ్య ఆస్పత్రిలో కోలుకోగా, ఆమె భర్త మాత్రం మంగళవారం కన్నుమూశాడు. ఈ ఉదంతంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.