వసూళ్ల రాజా లిస్టు ఉంది... త్వరలోనే శ్రీకృష్ణ జన్మాష్టమికి పంపిస్తా...

వసూళ్ల రాజా లిస్టు ఉంది... త్వరలోనే శ్రీకృష్ణ జన్మాష్టమికి పంపిస్తా...
  • రెండు రోజుల్లో కలెక్టర్ కు, పోలీసు అధికారులకు ఆ లిస్టు ఇస్తా..
  • ఐదేళ్లలో వాళ్ళు తిన్నది అంతా కక్కిస్తా..
  • ప్రజా పాలన ప్రారంభోత్సవ సభలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ సంచలన  వ్యాఖ్యలు...

 ముద్ర ప్రతినిధి పెద్దపల్లి గత ఎమ్మెల్యే హయాంలో... ఎవరెవరు ఎంత తిన్నది... ఏ పథకం కింద ఎంత వసూలు చేశారన్నది... ఎవరికి ఉద్యోగాలు పెట్టి ఇస్తామని  ఎవరి దగ్గర తన అనుచరులు ఎంతెంత తీసుకున్నారన్నది...  పూర్తి డాటా నా వద్ద ఉంది...  ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఐదేళ్లలో అమాయక ప్రజల నుంచి లంచాల రూపేనా తిన్నదంతా  కక్కిస్తా... వాళ్లు ఎంతటి వారైనా శ్రీకృష్ణ జన్మాస్థలానికి  పంపిస్తా... " అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమెరకు రామగుండం నగరపాలక సంస్థ 29వ డివిజన్ లో గురువారం ప్రజాపాలన కార్యక్రమంలో  ఆయన జిల్లా అదనపు కలెక్టర్ అరుణ శ్రీ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయ హస్తం పారదర్శకంగా జరగాలని. ఆరు గ్యారంటీ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని, అధికారులు సిబ్బంది,  ఈ విషయంలో ఓపిక పట్టి అందరి వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించాలని  ఆయన కోరారు.

ఈ పథకాలకు దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వద్దకు వసుళ్ళ రాజాలు వస్తారని, ఇంటింటికి వచ్చి తాము పలానా పథకం ఇప్పిస్తామని అందుకు కొంత ఖర్చు అవుతుందని అమాయక ప్రజలను మోసం చేసేందుకు వస్తారని, అలాంటప్పుడు ప్రజలు రికార్డు చేసి తనకు పంపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఏ ఒక్క పథకానికి కూడా ఎవరు ఒక్క పైసా కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దగ్గరలోని ఓసిపితో మన గోదావరిఖనిలో ఏ ఇంటికి వెళ్లి చూసినా బిపి షుగర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు  ఎంతోమంది ఉన్నారని.. వారంతా హైదరాబాద్కు చికిత్స కోసం వచ్చినప్పుడు ఆరోగ్య శ్రీ సరిపోకపోతే తన దృష్టి తీసుకు వస్తే నేనే దగ్గర ఉండి ఎంతమందికి వైద్యం చేయించానని, ఇప్పుడు నా అవసరం లేకుండానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచిందని అన్నారు.

ఇకపోతే గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో  టిఆర్ఎస్ నాయకులు దళిత బంధు, బీసీ బందు, రైతుబంధు, పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ లు, ఆర్ ఎఫ్ సి ఎల్, సింగరేణిలో ఉద్యోగాలు అంటూ  లక్షల కొద్ది వసూలు చేశారని ఆ చిట్టా మొత్తం నా వద్ద ఉందని త్వరలోనే జిల్లా కలెక్టర్కు అందజేస్తానని చెప్పడం సంచలనం రేకెత్తించింది. ఆరు నూరైనా ఆరు గ్యారెంటీ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందు తాయని ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, తర్వాత కూడా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. సమావేశంలో మేయర్ అనిల్ కుమార్, కమిషనర్ నాగేశ్వరరావు, కార్పొరేటర్ మహంకాళి స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.