సవాళ్లను ఎదుర్కొంటున్న మీడియా

సవాళ్లను ఎదుర్కొంటున్న మీడియా
  • జర్నలిస్టుల సంక్షేమం కోసం చర్యలు
  • హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్​ చౌటాలా


పంచకుల: ప్రస్తుత కాలంలో పత్రిక రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్​ చౌటాలా అన్నారు. ఎలక్ర్టానిక్​, ప్రింట్​ మీడియాలో వార్తను ముందు ప్రసారం చేసిన వారిదే పై చేయిగా ఉందన్నారు. వార్తను తొలుత ప్రసారం చేసే విషయంలో పోటీ పడే మీడియా మిత్రులు  సమయంనం పాటించడంతోపాటు పూర్తి నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉందని దుష్యంత్​ చౌటాలా అన్నారు. హర్యానా పంచకులలో చండీగఢ్ అండ్ హర్యానా జర్నలిస్ట్స్ యూనియన్ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు కార్తీకేయ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఎన్నోయేళ్లుగా పాత్రికేయ వృత్తిని  నిర్వహిస్తున్న పత్రికాధిపతులను ఉప ముఖ్యమంత్రి సన్మానించారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కే శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్ము, నరేంద్రభాటియా, సురేంద్ర భాటియా, దేవేంద్ర ఉప్పల్​ పాఠక్​, అరుణ్​ భాటియా, కౌలాష్​ జైన్​, అనిల్​ ఆర్య, రాజేశ్​ కుమార్​, శ్రీకాంత్​ ఆర్య, యధురామ్​ బన్సల్​, రూపేశ్​ బన్సల్​, ఏకాంత్​ గర్గ్​, రుషి సైనీలను సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కథనం ఎన్నో జీవితాలను కదిలించగలదన్నారు, మార్పు తీసుకురాగలదన్నారు. సమాజానికి మేలు చేసే దిశగా మీడియా కథనాలుండాలన్నారు. ప్రతీ వ్యక్తికి నిజం తెలిసేలా మీడియా కథనాలుండాలన్నారు. అదే సమయంలో అవినీతి, అన్యాయాలను ఎండగట్టాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం మీడియా సెంటర్​ను ప్రారంభించే పనులు చేపట్టామన్నారు. ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులకు ఇచ్చే పెన్షన్​ను రూ. 10 వేల నుంచి రూ. 15వేలు పెంచామన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య సంక్షేమం కోసం కూడా చర్యలు చేపడుతున్నామన్నారు. జర్నలిస్టులకు స్థలాలను కూడా అందించనున్నామని ఉప ముఖ్యమంత్రి దుష్యంత్​ ప్రకటించారు. కే శ్రీనివాస్ రెడ్డి,  బల్విందర్ సింగ్ జమ్ము మాట్లాడుతూ దేశంలో మీడియా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఐజేయూకు అనుబంధంగా పని చేస్తున్న చండీగఢ్ అండ్ హర్యానా జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు రామ్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ తమ యూనియన్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని వివరించారు.