ఖద్దరు చొక్కా ముసుగులో అధికార ఆధిపత్యం

ఖద్దరు చొక్కా ముసుగులో అధికార ఆధిపత్యం
  • ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గురు త్రిమూర్తులదే హవా...?
  • ఆస్పత్రిలో ముగ్గురు సెక్యూరిటీ గార్డుల పెత్తనం...? 
  • కేవలం ఒకే షిఫ్ట్ విధులకు ముగ్గురు పరిమితం.. 
  • కింది స్థాయి సిబ్బందికి విధులు నిర్వహించాలని బెదిరింపులు...?

ముద్ర, గోదావరిఖని: ప్రభుత్వ ఆసుపత్రిలో వారు పేరుకే సెక్యూరిటీ గార్డులు... కానీ పెత్తనం మొత్తం వారి కనుసైగల్లోనే నడుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పవచ్చు. ఆస్పత్రిలో ఈ ముగ్గురు త్రిమూర్తులు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్న తీరుగా కొనసాగుతున్న ఇప్పటివరకు దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే అనుచరుల పేరుతో బీఆర్ఎస్ నాయకుల పేరుతో చలామణి అయిన సదురు సెక్యూరిటీ గార్డులు ప్రస్తుతం ప్రభుత్వం మారగానే ప్రస్తుత ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ స్థానిక ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. ఎవరు అధికారంలో ఉన్న వారి వైపు వెంటనే మళ్లడం వారి వెంట తిరగడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే...

గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో ఈ మధ్యకాలంలో ముగ్గురు సెక్యూరిటీ గార్డుల వివాదం చిలికి చిలికి గాలి వానల మారుతుంది. అయితే మూడు షిఫ్టులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి విధులు నిర్వహించాలి. సుమారు 35 మంది సెక్యూరిటీ గార్డులు ఆసుపత్రిలో పనిచేస్తుండగా ఇందులో ముగ్గురు మినహాయించి మిగతా వారందరూ మూడు విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఈ ముగ్గురు కద్దర్ చొక్కా నాయకులు మాత్రం కేవలం ఉదయం షిఫ్ట్ కే పరిమితమై తమకు సంబంధించిన ఇతర రెండు షిఫ్ట్ లను మిగతావారు నిర్వహించాలని హుక్కుమ్ జారీ చేస్తున్నట్లు ఆస్పత్రిలో జోరుగా చర్చ సాగుతుంది. అందరు మూడు షిఫ్టులు విధులు నిర్వహిస్తే కేవలం ముగ్గురు మాత్రం ఒకే షిఫ్ట్ నిర్వహించడం వివాదాలకు దారి తీస్తుంది. ఇప్పటికైనా దీనిపై స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించి ఖద్దరు చొక్కా ముసుగులో అధికార ఆధిపత్యం చెలాయిస్తున్న ముగ్గురిపై విచారణ చేపట్టే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.