శ్రీవారి కానుక

శ్రీవారి కానుక
  • భక్తుల కోసం మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు
  • ఆది దేవుడి పాదాల చెంతన ఉంచి విక్రయం
  • లాభాపేక్ష లేకుండా నిర్ధారించిన ధరకు విక్రయం
  • టీటీడీ వార్షిక బడ్జెట్​ రూ. 5122 కోట్లు
  • వేద పాఠశాలల అధ్యాపకులకు వేతనాలు పెంపు
  • వచ్చే ఏడాది హుండీ ఆదాయం రూ. 1611 కోట్ల అంచనా
  • డిపాజిట్లపై వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం రూ. 1167 కోట్లు
  • బడ్జెట్​ను ఆమోదించిన టీటీడీ పాలకవర్గం

ముద్ర, ఏపీ బ్యూరో :తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులకు టీటీడీ పాలకవర్గం శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా తయారు చేయించిన మంగళసూత్రాలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి విక్రయించనున్నట్లు ప్రకటించింది. వాటితో పాటుగా లక్ష్మీకాసులను సైతం తయారు చేసి విక్రయించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సోమవారం తిరుమల దేవస్థానం పాలకవర్గం సమావేశ జరిగింది. ఈ సందర్భంగా వార్షిక బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదముద్ర వేసింది. అనంతరం టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. ధర్మప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలను తయారుచేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందిన తరువాత భక్తులకు విక్రయించేందుకు నిర్ణయించామన్నారు. 5 గ్రాములు, 10 గ్రాముల్లో ఉంటాయని, వీటిని నాలుగు లేదంటే ఐదు డిజైన్లలో తయారు చేస్తామన్నారు. వీటితోపాటు లక్ష్మీకాసులను కూడా తయారు చేయాలని నిర్ణయించామన్నారు. వీటిని లాభాపేక్ష లేకుండా విక్రయిస్తామని, గ‌తంలో 32 వేల మందికి సామూహిక వివాహాలు జ‌రిపించిన‌పుడు మంగ‌ళ‌సూత్రాలు అందిస్తే ఏ ఒక్కరూ మ‌తం మారలేదన్నారు. 


మ‌హిళ‌ల‌కు స్వామివారి కానుక 

నూతన వివాహం చేసుకోనే వధూవరులకు మంగళసూత్రాల విక్రయానికి బోర్డు ఆమోదం తెలిపారు. మంగళసూత్రాలు, లక్ష్మీకాసులను ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాస్ట్ టూ కాస్ట్ విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే, గతంలో శ్రీవారి బంగారు కానుకల కోసం మహిళల నుంచి డిమాండ్​ఉందని, ఈ నేపథ్యంలోనే మంగళసూత్రాలు విక్రయిస్తామని తెలిపారు. కేవలం నూతన వధూవరులు మాత్రమే కాకుండా మహిళలు ఈ స్వామివారి కానుకను కొనుగోలు చేయవచ్చని, కానీ, కొత్త వివాహం చేసుకునేవారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. 

రూ. 5 వేల కోట్లు దాటిన వార్షిక బడ్జెట్​

తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్‌ రూ.5వేలకోట్లు దాటింది. రూ.5,141.74 కోట్ల అంచనాలతో 2024–-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. రూ.5,122.80 కోట్ల బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదించింది. ఇంజినీరింగ్ విభాగానికి రూ.350 కోట్లు, హిందూ ధర్మప్రచార, అనుబంధ ప్రాజెక్టులకు రూ.108.50 కోట్లు కేటాయించారు. వివిధ సంస్థలకు గ్రాంట్స్ రూపంలో రూ.113.50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం రూపంలో రూ.50 కోట్లు, టీటీడీ విద్యాసంస్థలు, పలు వర్సిటీలకు గ్రాంట్స్ రూ.173.31 కోట్లు, పారిశుధ్య విభాగానికి రూ.261.07 కోట్లు, నిఘా- భద్రతా విభాగానికి రూ.149.99 కోట్లు, వైద్య విభాగానికి రూ.241.07 కోట్లు కేటాంచారు. స్విమ్స్ అస్పత్రిలో 300 పడకల నుంచి 1200 పడకల పెంపునకు రూ.148 కోట్లతో టెండర్ ప్రకటనకు టీటీడీ ఆమోదం తెలిపింది. రూ.2.5 కోట్లతో సప్తగిరి సత్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఎస్ఎంసీతో పాటు పలు కాటేజీల ఆధునీకరణకు రూ.10 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. టీటీడీలో ఒరాకిల్ ఫ్యూషన్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ వినియోగానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. అన్నమయ్య భవన్ ఆధునీకరణకు రూ.1.47 కోట్లు కేటాయించింది.

ఆదాయం ఇది 

ఆదాయం అంచనాలో శ్రీవారి హుండీ కానుకల ద్వారా రూ. 1,611 కోట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రూపంలో రూ.1,167 కోట్లు, ప్రసాదం విక్రయాల ద్వారా రూ.600 కోట్లు, కల్యాణకట్ట రసీదుల ద్వారా రూ.151.50 కోట్లు, గదులు, కల్యాణమండపం బాడుగల ద్వారా రూ.147 కోట్లు, శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవ టికెట్ల విక్రయాల ద్వారా రూ.448 కోట్లు ఆదాయం సమకూరుతుందని వార్షిక బడ్జెట్​లో అంచనా వేశారు. టీటీడీలో  పుస్తకాల విక్రయాల ద్వారా రూ.35.25 కోట్లు, అగర్బత్తి, టోల్ గేట్, విద్య కళాశాల ద్వారా రూ.74.50 కోట్లు ఆదాయం వస్తుందని బోర్డు భావిస్తోంది.
 
వేతనాలు పెంపు

టీటీడీ పరిధిలో లడ్డు ట్రే మోసే కార్మికుల వేతనాలు రూ.15 వేలు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వేద పాఠశాలల్లో సంభావన అధ్యాపకుల వేతనాలు రూ.34 వేల నుంచి రూ.54 వేలకు పెంచారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో పని చేసేందుకు కొత్త పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. వచ్చేనెల 3, 4, 5వ తేదీల్లో ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నట్లు పాలకమండలి చైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సదస్సుకు 57 మంది మరాధిపతులు, పీఠాధిపతులు హాజరవుతారని తెలిపారు. సలహాలు, సూచనలను స్వీకరించి అమలు చేస్తామని భూమన వివరించారు.
అదే విధంగా టీటీడీ ఆలయాలలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకుల జీతాలు పెంచుతున్నట్లు పాలకమండలి పేర్కొంది. దీంతో పాటు 56 వేదపారాయణదారుల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వేదపండితుల పింఛన్ రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు సహకరించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పాలకమండలి తీర్మానం చేసింది.