భారత్ కోచ్ పదవికి 3వేల దరఖాస్తులు...

భారత్ కోచ్ పదవికి 3వేల దరఖాస్తులు...

ముద్ర,సెంట్రల్ డెస్క్:-భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ పదవీకాలం త్వరలో ముగియనుండడంతో కొత్త కోచ్‌ కోసం BCCI అప్లికేషన్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే మార్చి 27తో దరఖాస్తులు గడువు ముగియగా.. దాదాపు 3 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మెజార్టీ ఫేక్‌ దరఖాస్తులని సమాచారం. మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకుల పేర్లతో భారీగా ఫేక్ దరఖాస్తులు దాఖలైనట్లు తెలుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా పేర్లతో పాటు మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎం.ఎస్‌.ధోని, సెహ్వాగ్, హర్భజన్ సింగ్‌ పేరిట దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీటన్నింటిని ఫేక్‌ అప్లికేషన్లుగా తేల్చింది బీసీసీఐ. గుర్తు తెలియని వ్యక్తులు గూగుల్‌లో అందుబాటులో ఉన్న ఫామ్‌ నింపి దరఖాస్తు దాఖలు చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే కోచ్‌ పదవిపై ఆసక్తి ఉన్న క్రికెటర్ల నుంచి వచ్చిన దరఖాస్తులపై మాత్రం బీసీసీఐ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ తర్వాత కోచ్‌గా ద్రవిడ్‌ పదవీకాలం ముగియనుంది. ఇక కోచ్‌ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఇష్టపడకపోవడంతో కొత్త కోచ్‌ కోసం అన్వేషణ మొదలు పెట్టింది బీసీసీఐ. కోచ్‌ పదవికి దరఖాస్తు చేసే వారు తప్పనిసరిగా 30 టెస్టులతో పాటు 50 టెస్టులు ఆడి ఉండాలని.. 60 ఏళ్ల లోపు ఉండాలని బీసీసీఐ షరతులు పెట్టింది.

టీమిండియా కోచ్ రేసులో లక్ష్మణ్‌తో పాటు గౌతమ్‌ గంభీర్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉన్నాడు. అయితే భారత్‌ కోచ్‌ పదవిపై లక్ష్మణ్‌ ఆసక్తి చూపట్లేదని సమాచారం. ఐపీఎల్‌-2024 విజేత కోల్‌కతా జట్టుకు మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్‌ పేరు వినిపిస్తున్నప్పటికీ ఆయన దరఖాస్తుపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు.