అనూహ్యాంగా ఆ ముగ్గురు ఔట్​

అనూహ్యాంగా ఆ ముగ్గురు ఔట్​
  • షమీ, సుందర్​, అర్షదీప్​లను ఎంపిక చేయని బీసీసీఐ

ముంబై: వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత బృందాలను బీసీసీఐ ప్రకటించింది. సీనియర్లు, జూనియర్ల మిక్స్‌తో ఉన్న ఈ జట్లపై కొందరు విమర్శలు చేస్తుంటే.. మరికొందరు మెచ్చుకుంటున్నారు. ఏదేమైనా ఈ పర్యటనలో ముఖ్యంగా వన్డే జట్టులో కొందరు పేర్లు మిస్సయ్యాయి. కచ్చితంగా ఉంటారని అనుకున్న ఈ ప్లేయర్లు జట్టులో లేకపోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. 

మహమ్మద్ షమీ: టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ ఇటీవల మంచి ఫామ్ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా షమీ ఫర్వాలేదనిపించాడు. భారత్ తరఫున మొత్తం 90 వన్డేలు ఆడిన అతను 162 వికెట్లు కూల్చాడు. అతని సగటు 25.99, ఎకానమీ 5.61 కూడా బాగానే ఉన్నాయి. కానీ అతన్ని విండీస్ పర్యటనకు ఎంపిక చేయలేదు.అసలే బుమ్రా లేని భారత పేస్ దళానికి నాయకత్వం వహించాల్సింది షమీనే అని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అతన్ని వన్డే జట్టు నుంచి బీసీసీఐ తప్పించింది. మరి వన్డే వరల్డ్ కప్ జరిగే ఏడాదిలో అతన్ని పక్కన పెట్టడం వెనుక బీసీసీఐ ఎలాంటి వ్యూహాలు వేస్తుందో చూడాలి.

వాషింగ్టన్ సుందర్: గతేడాది భారత్ తరఫున వన్డేల్లో రాణించిన ప్లేయర్లలో వాషింగ్టన్ సుందర్ ఒకడు. 2022లో 11 మ్యాచులు ఆడిన సుందర్ 212 పరుగులు చేయడంతోపాటు 13 వికెట్లు కూడా తీసుకున్నాడు. దీంతో వన్డే వరల్డ్ కప్‌లో అతన్ని కూడా ఆడిస్తారని అంతా అనుకున్నారు. కానీ విండీస్ పర్యటనలో అతన్ని తప్పించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే దీనికి ప్రధాన కారణం సుందర్ గాయాలే అతని సమాచారం. ఐపీఎల్ కూడా సుందర్ పూర్తిగా ఆడలేదు. అలాగే ఈ ఏడాది ఆడిన నాలుగు వన్డేల్లో కూడా అతను పెద్దగా రాణించలేదు. దానికితోడు బీసీసీఐ సెలెక్ట్ చేసిన జట్టులో జడేజా, అక్షర్‌తో కలిపి నలుగురు స్పిన్నర్లు ఉండటంతో సుందర్‌కు ఛాన్స్ దక్కలేదు.


అర్షదీప్ సింగ్: ఐపీఎల్‌లో సూపర్ పెర్ఫామెన్స్‌తో భారత జట్టులోకి దూసుకొచ్చిన పంజాబ్ ప్లేయర్ అర్షదీప్ సింగ్. ఈ ఎడం చేతి వాటం పేసర్ పొట్టి ఫార్మాట్లో కొంత ప్రభావం చూపించాడు. అయితే వన్డేల్లో మాత్రం ఏమాత్రం రాణించలేదు. దీంతో అతన్ని కూడా బీసీసీఐ పక్కన పెట్టేసింది. కానీ ఎడం చేతి వాటం పేసర్ కావడం వల్ల అతనికి జట్టులో చోటు కల్పించాల్సిందని కొందరి వాదన. దేశవాళీల్లో జయదేవ్ ఉనద్కత్ రాణించినా.. అతను కేవలం రెడ్ బాల్ ఫార్మాట్లోనే మెరుగైన ప్రదర్శన చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను పెద్దగా రాణించింది లేదు. దీంతో అతనికితోడుగా అర్షదీప్‌ను సెలెక్ట్ చేయాల్సిందని నిపుణులు అంటున్నారు. కానీ వన్డే ఫార్మాట్‌లో అర్షదీప్ గణాంకాలు కూడా అంత గొప్పగా లేవు. అందుకే అతన్ని బీసీసీఐ పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు.