ఐపీఎలే బీసీసీఐని మింగేస్తోంది!

ఐపీఎలే బీసీసీఐని మింగేస్తోంది!
  • మాజీ చీఫ్​ సెలెక్టర్​ ఎమ్మెస్కే ప్రసాద్

హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. ఏదో ఒక రోజు భారత క్రికెట్ బోర్డును మింగేస్తుందని మాజీ చీఫ్ సెలెక్టర్, తెలుగు తేజం ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ఐపీఎల్ పూర్తిగా కమర్షియల్ టోర్నమెంట్ అని చెప్పిన ఎమ్మెస్కే.. ఫ్రాంచైజీ లీగ్‌ల కారణంగా అంతర్జాతీయ క్రికెట్ చచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ఇప్పటికే ఐపీఎల్ కారణంగా ఐసీసీ టోర్నీల్లో టీమిండియా విఫలమవుతుందని తెలిపాడు.  'ఐపీఎల్ కచ్చితంగా కమర్షియల్‌ టోర్నమెంట్‌. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇలాగే కొనసాగితే కొన్నిరోజులకు బీసీసీఐ కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఫ్రాంచైజీ లీగ్‌ల కారణంగా భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్‌కు మనుగడ ఉండదు. ఫుట్‌బాల్‌లో ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌నే తీసుకుంటే ఆటగాళ్లంతా తమ దేశాలకు ఆడడం కంటే కూడా ఆ లీగ్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే జాతీయ జట్టుకు ఆడితే ఒక్క రూపాయి వస్తే, ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గొంటే వంద రూపాయలు ఇస్తారు. కాబట్టి ఏ ఆటగాడు అయినా దేశం కంటే ఫ్రాంచైజీ లీగ్స్ ఆడేందుకే ఇష్ట పడుతారు. బీసీసీఐ దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయాలి. లేదంటే భవిష్యత్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లుండవు. ఫ్రాంచైజీ లీగ్స్‌కు జనాలు అలవాటుపడితే ద్వైపాక్షిక సిరీస్‌లను చూసే వారుండరు. అప్పుడు ఈ సిరీస్‌లను స్పాన్సర్‌ చేసే వాళ్లుండరు. నిజం చెప్పాలంటే, ఇప్పుడు ఎక్కువ మ్యాచ్‌లైపోయాయి. ఆటగాళ్లంతా రోబోల్లా అనిపిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ లీగ్స్‌ను విరామం లేకుండా ఆడుతున్నారు. భారత ఆటగాళ్లు కూడా విరామం లేకుండా ఆడుతూనే ఉన్నారు.తీరిక లేని షెడ్యూల్ కారణంగానే డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలైంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు కొంత సమయం ఉండి కౌంటీలాంటి మ్యాచ్‌లాడివుంటే జట్టుకు ఆసీస్ చేతిలో ఘోర పరాజయం ఎదురయ్యేది కాదు. ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాల్సి రావడంతో భారత ఆటగాళ్లు టెస్ట్ ఫార్మాట్‌కు స్విచ్ కాలేకపోయారు.'అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.