‘రాయల్​’ విక్టరీనందించిన అరుణ్​

‘రాయల్​’ విక్టరీనందించిన అరుణ్​
  • కార్తీక్​ విధ్వంసం.. చెపాక్​అపజయం

ముంబై: కెప్టెన్ అంటే ఇలా ఆడాలి అనేట్లుగా ఆడాడతను. ఒంటి చేత్తో జట్టుకు ఘన విజయం అందించాడు. అతనే అరుణ్ కార్తీక్. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో నెల్లాయ్ రాయల్ కింగ్స్ జట్టుకు సారధ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న అతను.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చెపాక్ సూపర్ గిల్లీస్‌ను ఒంటి చేత్తో చిత్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెపాక్ టీం కెప్టెన్ నారాయణ్ జగదీశన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ ఆ జట్టుకు శుభారంభం అందించడంలో జగదీశన్ (15), రంజన్ పాల్ (2) విఫలమయ్యారు. అయితే ఆ తర్వాత వచ్చిన మాజీ సీఎస్‌కే స్టార్ బాబా అపరాజిత్ (79) మరోసారి జట్టును ఆదుకున్నాడు. చివర్లో హరీష్ కుమార్ (20) ఫర్వాలేదనిపించాడు. దీంతో చెపాక్ సూపర్ గిల్లీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు వచ్చిన రాయల్ కింగ్స్‌కు కెప్టెన్ అరుణ్ కార్తీక్ (104 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అందించాడు.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే చెపాక్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఈ క్రమంలోనే ఐదు సిక్సర్లు, పది ఫోర్లతో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. జట్టు విజయానికి 6 పరుగులు అవసరం అనగా భారీ సిక్సర్ బాదిన అతను.. టీంకు విజయం అందించడంతోపాటు సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అతనికి శ్రీ నిరంజన్ (24), రితిక్ ఈశ్వరన్ (26) మంచి సహకారం అందించారు. అరుణ్ కార్తీక్ విధ్వంసంతో రాయల్ కింగ్స్ జట్టు కేవలం 18.5 ఓవర్లలోనే 160 పరుగులు చేసి, లక్ష్యాన్ని ఛేదించింది.చెపాక్ బౌలర్లలో సిలంబరసన్, రాకీ బి ఇద్దరూ చెరో వికెట్ తీసుకున్నారు. మిగతా బౌలర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అరుణ్ కార్తీక్ విధ్వంసం ముందు ఎవరూ నిలవలేకపోయారు. లీగ్‌లో ఇది చెపాక్ టీంకు వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం.