ఆసియా కప్​ షెడ్యూల్​ ప్రకటన

ఆసియా కప్​ షెడ్యూల్​ ప్రకటన
  • ఆగస్టు 31 నుంచి టోర్నీ
  • సెప్టెంబర్​ 17న ముగింపు
  • వివాదాలకు తెరదించిన ఏసీసీ

న్యూఢిల్లీ: వివాదాల నడుమ ఆసియా కప్ 2023కి ముహూర్తం ఖరారైంది. గురువారం ఆసియా కప్ షెడ్యూల్‌ను ఏసీసీ ప్రకటించింది. ఆగస్టు 31న ఈ టోర్నీ మొదలవుతుంది. సెప్టెంబరు 17 వరకు ఈ మ్యాచులు ఉంటాయని తెలిపింది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ ఆడుతున్నాయి. నేపాల్ తొలిసారి ఈ టోర్నీ ఆడేందుకు అర్హత సాధించింది. వీటిని రెండు గ్రూపులుగా విడగొడుతారు.
ఈ రెండు గ్రూపులలో టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు.. టోర్నీలో ముందడుగు వేస్తాయి. ఒక గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, నేపాల్ ఉండగా.. మరో గ్రూపులో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. మొత్తం 13 మ్యాచులు జరిగే ఈ టోర్నీలో కేవలం నాలుగు మ్యాచులే పాకిస్తాన్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. మిగతా 9 మ్యాచులకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఆసియా కప్ మ్యాచులు కూడా వన్డే ఫార్మాట్‌లోనే జరగనున్నాయి. ఈ టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ దేశానికి తమ జట్టును పంపించడం కుదరదని బీసీసీఐ తేల్చి చెప్పింది. భారత్, పాక్ మధ్య సంబంధాలు బాగలేని ఈ తరుణంలో టీమిండియాను భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ పంపడం కుదరదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో చాలా గొడవ జరిగిన తర్వాత పాకిస్తాన్ కొత్త ఆలోచన చేసింది. ఈ టోర్నీని హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహిస్తామని, కొన్ని మ్యాచులు తమ దేశంలో నిర్వహించి, మరికొన్నింటిని యూఏఈలో ఏర్పాటు చేస్తామని తెలిపింది. దీనిపై కూడా బీసీసీఐ అంత ఆసక్తి చూపలేదు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బీసీసీఐ మధ్య చాలా గొడవ జరిగింది.
ఆ దేశ మాజీలు, ఈ దేశ మాజీలు కూడా ఈ విషయంపై రకరకాల కామెంట్లు చేశారు. ఇలాంటి సమయంలో హైబ్రీడ్ మోడల్‌కు ఆమోదం తెలుపుతున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తాజాగా ప్రకటించింది. అయితే పాక్ ఆవల జరిగే మ్యాచులను యూఏఈలో కాకుండా శ్రీలంకలో నిర్వహించాలని షరతు పెట్టింది. దీనికి పీసీబీ కూడా ఆమోదం తెలపడంతో ఆసియా కప్​ నిర్వహణకు మార్గం సుగమమైంది.