హ్యాండ్​బాల్​లో తెలుగు టాలన్స్​ హవా

హ్యాండ్​బాల్​లో తెలుగు టాలన్స్​ హవా

జైపూర్​: జైపూర్ వేదికగా జరుగుతున్న ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌) తొలి సీజన్లో తెలుగు టాలన్స్‌ అద్భుతంగా ఆడుతోంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ ప్యాట్రియాట్స్‌పై ఘనవిజయం సాధించిన టాలన్స్.. ఈ టోర్నీలో ముచ్చటగా మూడో విజయం నమోదు చేసింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఎదురులేని విజయాలు సాధించిన తెలుగు టాలన్స్‌.. ఆ తర్వాత రెండు ఓటములు చవిచూసింది.

ఈ రెండు ఓటముల అనంతరం పుంజుకున్న టాలన్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో రాజస్థాన్‌ పాట్రియాట్స్‌పై 2-–8-, 2–4తో తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్‌ పాట్రియాట్స్‌ 50 సార్లు గోల్‌కు చేరువగా రాగా.. అడ్డుగోడలా నిలిచిన టాలన్స్‌ గోల్‌ కీపర్‌లు వారికి గోల్స్ చేసే అవకాశం ఇవ్వలేదు.

దీంతో ఆ జట్టు 24 గోల్స్‌తోనే సరిపెట్టుకుంది. తెలుగు టాలన్స్‌ 48 సార్లు మాత్రమే గోల్‌ ప్రయత్నం చేసినా.. వాటిలో 28 సార్లు సక్సెస్ అయ్యారు గ్రూప్‌ దశలో ఐదు మ్యాచుల్లో తెలుగు టాలన్స్‌కు ఇది మూడో విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్ ప్రథమార్థం అత్యంత ఉత్కంఠగా సాగింది. గోల్‌ కోసం ఇటు టాలన్స్‌, ఇటు పాట్రియాట్స్‌ చెమటోడ్చాయి.

మ్యాచ్‌లో 14 నిమిషాల వద్ద 6-6తో టాలన్స్‌, పాట్రియాట్స్‌ సమంగా నిలిచాయి.. ఆ తర్వాత రాజస్థాన్‌ 9–-7తో రెండు పాయింట్ల ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత తెలుగు టాలన్స్‌ పుంజుకున్నా కూడా మొదటి హాఫ్‌ను రాజస్థాన్‌ 1–4, -1–3తో ఓ గోల్‌ ఆధిక్యంతోనే ముగించింది. అయితే ద్వితీయార్థం ఆరంభంతోనే తెలుగు టాలన్స్‌ దూసుకుపోయింది. ఆటగాళ్లంతా జోరు చూపించడంతో చూస్తుండగానే టాలన్స్ 1–6, -1–5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.