ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే కోహ్లీ టీమ్‌కు భారీ షాక్‌

ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే కోహ్లీ టీమ్‌కు భారీ షాక్‌

ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు,   ఆర్​సీబీ జట్టుకు షాక్ మీద షాక్ తగులుతోంది. ఆ జట్టు ప్రధాన ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో టోర్నీలో ఆడడం అనుమానంగానే ఉంది. మ్యాక్సీ విషయంలో ఇప్పటికే బెంగళూరు జట్టు ఆందోళనతో ఉంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీకి గుండె బద్దలయ్యే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఏకంగా ఇద్దరు స్టార్‌ ప్లేయర్లు టోర్నీకి దూరం కానున్నారని బెంగళూరును మరింత ఆందోళనలోకి నెట్టింది. వన్డేల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌, ఆసీస్‌ స్టార్‌ పేసర్ జోష్‌ హాజిల్‌వుడ్‌ మడమ సమస్య కారణంగా సీజన్‌ మొత్తానికే దూరం కానున్నాడని తెలుస్తోంది. అలాగే స్టార్‌ బ్యాటర్‌ రజత్‌ పాటిదార్‌ సైతం మడమ గాయం కారణంగానే సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లు మిస్‌ అయ్యే అవకాశం ఉంది. గాయం కారణంగా ఇటీవలే భారత్‌తో జరిగిన టెస్ట్‌, వన్డే సిరీస్‌ల్లో కూడా ఆడలేదు హాజిల్‌వుడ్‌. గాయం నుంచి వేగంగా కోలుకుని కనీసం ఐపీఎల్‌ సెకెండ్‌ ఫేజ్‌ మ్యాచ్‌లకైనా అందుబాటులో ఉండాలని అతను కోరుకుంటున్నారు.

దురదృష్టవశాత్తూ హాజిల్‌వుడ్‌ సీజన్‌ మొత్తానికే దూరమైతే, బెంగళూరుకు భారీ ఎదురుదెబ్బగా పరిగణించాలి. 2022 మెగా వేలంలో హాజిల్‌వుడ్‌ను ఆర్సీబీ రూ. 7.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక రజత్ పాటిదార్ విషయానికొస్తే.. మడమల నొప్పితో బాధపడుతోన్న అతనికి కనీసం మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కాబట్టి అతను ఐపీఎల్ ప్రథమార్థంలో కనిపించడని తెలుస్తోంది. రజత్ పాటిదార్ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్​సీఏలో  శిక్షణ తీసుకుంటున్నాడు. అతని ఎంఆర్​ఐ  స్కాన్ నివేదిక ప్రకారం మరింత విశ్రాంతి అవసరం. పాటిదార్ లేకపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బ్యాటింగ్ లైనప్‌లో మార్పు కనిపించవచ్చు. ఎందుకంటే గత సీజన్ లో 3వ స్థానంలో ఆడిన రజత్ మొత్తం 333 పరుగులు చేశాడు. ఆర్​సీబీ  తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా కూడా నిలిచాడు. చీలమండ నొప్పితో బాధపడుతున్న రజత్ పాటిదార్‌ను ఆర్‌సీబీ ద్వితీయార్థంలో ఉంచుకుంటుందా లేదా మరో ఆటగాడిని ఎంచుకుంటుందా అనేది ప్రశ్న.