స్లో ఓవర్ రేట్‌కు భారీ పెనాల్టీ

 స్లో ఓవర్ రేట్‌కు భారీ పెనాల్టీ
  • రెడ్ కార్డ్ సిస్టం తీసుకొచ్చిన సీపీఎల్

లాడర్ హిల్​ :  ఇటీవలి కాలంలో క్రికెట్‌‌లో పెద్ద సమస్యగా మారిన విషయం స్లో ఓవర్ రేట్. దీని వల్ల సమయానికి మ్యాచ్ ముగించడం కష్టంగా మారుతోంది. ఈ తప్పుకు వేసే శిక్ష కేవలం జరిమానానే కావడంతో ఆయా జట్ల కెప్టెన్లు దీన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే ప్రముఖ టీ20 లీగ్ కరీబియన్ ప్రీమిర్ లీగ్ (సీపీఎల్-203)లో కొత్త రూల్ తీసుకొచ్చారు.  ఏ జట్టయినా స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేస్తే వారికి పెనాల్టీ వేయాలని ఈ లీగ్ నిర్వాహకులు నిర్ణయించారు. ఫుట్‌బాల్‌లో ఉన్నట్లే రెడ్ కార్డ్ వంటి సిస్టంను దీని కోసం ఉపయోగిస్తారట. ఈ రూల్ ప్రకారం, 20వ ఓవర్ వేసే సమయంలో ఒక జట్టు షెడ్యూల్ టైం మిస్ అయితే.. ఆ టీం నుంచి ఒక ప్లేయర్‌ను మైదానం నుంచి తప్పించేస్తారట.  సాధారణంగా టీ20 లెక్కల ప్రకారం.. ఇన్నింగ్స్ మొదలైన 72 నిమిషాల 15 సెకన్లలోపు 17వ ఓవర్ వేసేయాలి. 76 నిమిషాల 30 సెకన్లలోపు 18వ ఓవర్, 80 నిమిషాల 45 సెకన్లలోపు 19వ ఓవర్ పూర్తిచేసేయాలి. ఇక చివరి ఓవర్‌ను 85 నిమిషాల కల్లా ముగించేయాలి. కానీ ఇటీవల జరుగుతున్న చాలా మ్యాచుల్లో ఇలా జరగడం లేదు.

దాదాపు అన్ని జట్లూ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేస్తున్నాయి. దీని వల్ల మ్యాచులు సమయానికి ముగించడం కుదరడం లేదు. ఈ క్రమంలోనే సీపీఎల్‌లో కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఫీల్డింగ్ చేస్తున్న టీం కనుక 18వ ఓవర్‌ను సమయానికి మొదలు పెట్టలేదంటే.. థర్టీ యార్డ్ సర్కిల్ అవతల ఒక ఫీల్డర్‌ను తగ్గించేస్తారు. ఒకవేళ 19వ ఓవర్ కూడా సమయానికి ప్రారంభించకపోతే.. అప్పుడు అదనంగా మరో ఫీల్డర్ ఈ సర్కిల్ లోపలకు వచ్చేయాలి. అంటే అప్పుడు సర్కిల్ లోపల ఆరుగురు ఫీల్డర్లు ఉంటారు. ఇక 20వ ఓవర్ సమయానికి ప్రారంభం కాకపోతే ఒక ఫీల్డర్ మైదానం వీడాల్సి వస్తుంది. అంతేకాదు, మిగతా ప్లేయర్లలో ఆరుగురు సర్కిల్ లోపలే ఫీల్డింగ్ చేయాలి.  బ్యాటర్లు కనుక టైం వేస్ట్ చేస్తున్నట్లు అనిపిస్తే.. అంపైర్లు వారికి వార్నింగ్ ఇస్తారట. అయినా సరే వాళ్లు దాన్ని పట్టించుకోకుండా.. మరోసారి టైం వేస్ట్ చేయాలని చూస్తే ఆ టీం టోటల్ స్కోరులో ఐదు పరుగులు పెనాల్టీ కింద తగ్గించేస్తారట. ఇలా ఎన్నిసార్లు సమయం వృధా చేస్తారో అన్నిసార్లు ఐదు పరుగులు తగ్గించేస్తారట.