ఆర్చీరీలో భారత్​కు కాంస్యం

ఆర్చీరీలో భారత్​కు కాంస్యం

మెరిసిన జ్యోతి సురేఖ బృందం

కొలంబియా: ఆర్చరీ వరల్డ్‌కప్‌‌లో తెలుగమ్మాయి పతకంతో మెరిసింది. వరల్డ్ కప్ స్టేజ్‌-3 టోర్నమెంట్లో జ్యోతి సురేఖ బృందం కాంస్యం సాధించింది. కొలంబియాలోని మెడిలిన్‌‌లో ఆర్చరీ వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో మహిళల కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో జ్యోతి ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు మూడో స్థానంలో నిలిచింది.
ఈ జట్టులో జ్యోతితోపాటు అదితి గోపీచంద్‌ స్వామి, పర్ణీత్‌ కౌర్‌లు ఉన్నారు. ఈ ముగ్గురు అద్భుతమైన ప్రదర్శనలతో సెమీ ఫైనల్స్ చేరుకున్నారు. కానీ అక్కడ వారికి అదృష్టం కలిసి రాలేదు. దీంతో ఈ భారత త్రయం సెమీస్‌లో ఓటమి పాలైంది. అమెరికాకు చెందిన బృందం చేతిలో జ్యోతి బృందం ఓడిపోయింది. దీంతో కాంస్యం కోసం జరిగిన పోరులో తలపడాల్సి వచ్చింది.
ఈ కాంస్య పోరులో మెక్సికో జట్టుతో తలపడిన జ్యోతి బృందం చెమటోడ్చింది. మెక్సికో కూడా గట్టి పోటీ ఇవ్వడంతో ఈ రెండు జట్లు 2–3, 2-–2, 3–2 స్కోర్లతో సమంగా నిలిచాయి. దీంతో ఈ మ్యాచ్ ర్యాపిడ్ రౌండ్‌కు దారితీసింది. ఈ రౌండ్‌లో కూడా రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరకు ఈ రౌండ్ కూడా 2–9, -2–9తో టై అయింది. చివరకు టైబ్రేక్‌లో మెక్సికోకు ఓటమి తప్పలేదు.
పోటీలో మెక్సికో బృందం చక్కగా రాణించినా కూడా.. వారి బాణాలు లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. అదే సమయంలో జ్యోతి త్రయం సంధించిన బాణాలు.. టార్గెట్‌కు చాలా దగ్గరగా తగిలాయి. దీంతో వీరిని విజేతలుగా టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. ఈ విజయంతో జ్యోతి బృందం కాంస్య పతకాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
అదే సమయంలో పురుషుల బృందం కూడా ఈ టోర్నీలో కాంస్యంతో సరిపెట్టుకోవడం గమనార్హం. కాంపౌండ్‌ పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో అభిషేక్‌ వర్మ, ఓజాస్‌ ప్రవీణ్‌, ప్రథమేష్‌ త్రయం కూడా సెమీస్‌లో ఓడింది. అనంతరం కాంస్య పతకం కోసం జరిగిన పోరులో కొలంబియా బృందంతో పోరాడింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ జట్టు 2–3, 6-–2, 2–8తో కొలంబియాను ఓడించి కాంస్యం సాధించింది.