బోడుప్పల్ లో పలుచోట్ల చలివేంద్రాల ఏర్పాటు

బోడుప్పల్ లో పలుచోట్ల చలివేంద్రాల ఏర్పాటు
బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన చలివేంద్రం
  • పశువులకు, పక్షులకు ప్రత్యేకంగా నీటి తొట్లు

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: ఎండలు మండిపోతుండడంతో బాటసారుల దాహార్తి తీర్చడానికి వీలుగా ప్రభుత్వం ఎక్కడికక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు బోడుప్పల్ పట్టణ పరిధిలోని పలు ప్రాంతాలలో గురువారం నుంచి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.  కార్పొరేషన్ కమిషనర్ జి.రామలింగం సూచనల మేరకు, మున్సిపల్ సిబ్బంది అయిదు ప్రాంతాలలో చలివేంద్రాలను నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ఎన్టీఆర్, అంబేద్కర్, ఇందిరాగాంధీ విగ్రహాల జంక్షన్ లతో పాటు, బోడుప్పల్ మల్లికార్జున స్వామి ఆలయం, చెంగిచెర్ల పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వీటిని ఏర్పాటు చేశారు.

మూగ జీవాల కోసం ప్రత్యేకంగా నీటి తొట్లు

   బోడుప్పల్ పట్టణంలో మూగ జీవాలు, వన్యప్రాణులు, పక్షుల కోసం వేసవి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా నీటి తొట్లను ఏర్పాటు చేశారు. బోడుప్పల్ పట్టణంలో లక్ష్మీనగర్ కాలనీ పార్క్, అన్ని కాలనీలలోని ఓపెన్ జిమ్ లు, కార్పొరేషన్ లోని 28 డివిజనుల పరిధిలో ఉన్న కాలనీలలో ప్రధాన రహదారుల వెంబడి నీటి తొట్టెలు ఏర్పాటు చేసి, వాటిని తాగునీటితో నిత్యం తాగునీటితో నింపేలా ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ జి.రామలింగం తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి, ఈ ఏర్పాట్లు వర్షాకాల రుతువు వచ్చేదాకా కొనసాగించేలా చూస్తామని ఆయన వివరించారు.