మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య..

మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య..

ముద్ర,మేడ్చల్:- మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పీయస్ పరిధిలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కాలేజీ ప్లేస్మెంట్ దొరకలేదని నిరాశతో హాస్టల్ రూమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

వివరాల్లోకెళ్తే...మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ECE ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎండి మహ్మమద్.. కాలేజీ సమీపంలో సత్యదేవ్ బాయ్స్ హాస్టల్ ఉండేవాడు. గతవారం జరిగిన కళాశాల క్యాంపస్ సెలక్షన్స్ లో ప్లేస్మెంట్ దొరకకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు వనపర్తి జిల్లాకు చెందిన మహమ్మద్ బలేమియా కుమారుడు. బలేమియా వృత్తి రీత్యా ఆటోడ్రైవర్. ఇతని చిన్న కుమారుడు ఎండి మహమ్మద్ (22). ఈ మధ్యకాలంలో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్ లో ఇతను సెలెక్ట్ కాలేదు. అప్పటినుంచి దిగాలుగా ఉంటున్న మహమ్మద్ చదువుకుంటాను అని చెప్పి హాస్టల్ భవనంలో ఉన్న ఐదో ఫ్లోర్లో ఒక రూమ్‌ లోకి వెళ్లాడు.

మహమ్మద్ ఎంతకు కిందకి రాకపోవడంతో అతని స్నేహితులు, హాస్టల్ సిబ్బంది కలిసి ఐదో ఫ్లోర్ లో మహమ్మద్ వెళ్లిన రూమ్ వద్దకు వెళ్లారు. తలుపు ఎంతకీ తీయకపోవడంతో, తలుపులు పగలగొట్టారు. అనంతరం లోపల ఉన్న అతడిని చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. మహమ్మద్ విగత జీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఫ్యాన్‌కు నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేట్ బషీరాబాద్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.