ముఖంపై ముడుతలా? 

ముఖంపై ముడుతలా? 

కాలానికి తగినట్లు చర్మ సంరక్షణ ఉండాలి. ఇందులో కూడా  కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటే చర్మ సమస్యలను  నివారించవచ్చు. మరీ మొండిగా ఉన్న చర్మ సమస్యలకు వైద్యున్ని సంప్రదించడం తప్పనిసరి. సరైన చర్మ సంరక్షణ వల్ల అకాల ముడతలు, నల్ల మచ్చలను నివారించవచ్చు. వయసు పెరిగే కొద్ది ముఖంపై ముడతలు పడటం చాలా సహజం. కొందరికి అయితే.. ముఖంపై నల్ల మచ్చల సమస్య కూడా వెంటాడుతుంది. పెరిగే వయసును ఎలాగూ తగ్గించలేం కానీ.. కొంత కాలం పాటు ముఖంపై వయసు  కనపడకుండా జాగ్రత్తపడొచ్చు. అదీ ఇంట్లోనే  చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ.. ఇక ముఖంపై ముడతల విషయానికి వస్తే... చర్మ సంరక్షణలో కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. 


– ఆలివ్ నూనెలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ నూనెలో విటమిన్ ఎ, డి , ఇలు ఉన్నాయి. దీనిని మర్దనా చేయడం వల్ల ఇది చర్మం స్థితిస్థాపకతను కాపాడుతుంది. చర్మాన్ని మృదువుగా ఉంచడంతో పాటు మెరిసేలా చేస్తుంది. ఆలివ్ ఆయిల్ ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ను పోగొట్టి, చర్మంపై వచ్చిన ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.

– ఒక గిన్నెలో రెండు చెంచాల టమోటా రసం, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ ను తీసుకుని, బాగా కలిపి  ముఖం, మెడకు పూయాలి. దీనిని పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి, తర్వాత చల్లటి నీటితో కడగాలి. టొమాటోలో పొటాషియం, విటమిన్ సి ఉంటాయి. అంతేకాదు 'లైకోపీన్' అనే రసాయనం ఉంటుంది. ఇది ముఖంపై ఉన్న రంధ్రాలను తగ్గిస్తుంది. నల్లమచ్చలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఆలివ్​ ఆయిల్​ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. 

–  ఒక  గిన్నెలో ఆలివ్​ఆయిల్​, నిమ్మరసాలను సమాన నిష్పత్తిలో  తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూయాలి. అరగంట తర్వాత ముఖాన్ని కడిగేయాలి. చర్మంపై ముడతలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది.ఇది చర్మంపై ముడతలు పడకుండా చేస్తుంది.


– ఆలివ్ ఆయిల్ ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. రోజూ ఆలివ్ ఆయిల్‌ని ముఖానికి రాసుకుని ఆవిరి పట్టడం వల్ల చర్మ కణాలు శుభ్రపడతాయి. ఫలితంగా బ్లాక్​హెడ్స్​, వైట్​ హెడ్స్​ బాధ తగ్గుతుంది. 

– గిన్నెలోకి ఒక చెంచా శనగపిండి, కొద్దిగా పసుపును తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆలివ్​ ఆయిల్​ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసి, పదిహేను నిముషాల తరువాత ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ఉన్న ముడుతలు, మచ్చలు తొలగిపోయి.. ముఖం కాంతులీనుతుంది.