జ్యూస్​లతో ఊబకాయానికి చెక్​!

జ్యూస్​లతో ఊబకాయానికి చెక్​!
Daily Health Tips for weight loss

మన దేశంలో ఊబకాయుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. శారీరక శ్రమ లేకపోవటం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, జీవనశైలి మార్పులు, జన్యుపరమైన కారణాల వల్ల చాలా మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్లనే ఊబకాయం అధికమని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కాలంలో సౌకర్యాలు పెరిగాయి. శారీరక శ్రమ తగ్గింది.

వ్యాయామం చేసేవారి సంఖ్య కూడా తక్కువే.. కేలరీలు కరిగించడమే తక్కువైపోయింది. తాజా కూరగాయలు, పండ్లకు బదులుగా.. ప్రాసెస్‌ చేసిన ఆహారం, స్వీట్స్‌, కూల్‌ డ్రింక్స్‌ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ కారణాల వల్ల.. బరువు పెరిగిపోతోంది. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా.. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయం కారణంగా.. డయాబెటిస్‌, గుండె సమస్యలు, ఎముకలు గుల్లబారడం, హైపర్‌టెన్షన్‌ వంటి సమస్యల ముప్పు పెరిగిపోతోంది. 

బరువును తగ్గడానికి  చాలామంది శాస్త్రీయ పద్ధతుల కంటే, రకరకాల కొత్త పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. వీటి కారణంగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండే అవకాశం ఉంది. తీసుకునే ఆహారంతోనే.. ఈజీగా బరువు తగ్గవచ్చు. అయితే తీసుకునే ఆహారంలో శరీరానికి తగినన్ని పోషకాలు ఉండాలి అన్న విషయం మాత్రం మరిచిపోకూడదు.  ప్రస్తుత కాలంలో ఆరోగ్యం, ఫిట్​నెస్​ పట్ల శ్రద్ధ వహిస్తారు. కానీ కొద్దిరోజుల తరువాత వీటిని గాలికి వదిలేసి ఫాస్ట్​ఫుడ్​ వైపు చూస్తుంటారు. ఇలా కాకుండా ఆరోగ్యానికి మేలుచేసే ఆహారాన్ని డైట్​లో చేర్చుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే అనారోగ్యం దరిచేరదు. నెలకోసారి చీట్​ మీల్స్​ తీసుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదని చెబుతున్నారు నిపుణులు. అయితే  ఉదయం పూట కొన్ని రకాల కూరగాయల జ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తాగితే.. శరీరంలో పేరుకున్న కొవ్వు త్వరగా కరుగుతుందని, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 

– కీర దోసకాయను సలాడ్‌‌లా వాడుతుంటారు చాలామంది. ఇది వేసవికాలంలో శరీర వేడిని తగ్గించి, చల్లబరుస్తుంది. దోసకాయలో నీటి శాతం ఎక్కువ. క్యాలరీలు తక్కువ ఉంటాయి. దీంతో బరువు సులభంగా తగ్గొచ్చు. ఒక గ్లాస్ కీర దోసకాయ జ్యూస్‌‌లో కొంచెం నిమ్మరసం, రెండు పుదీన ఆకులు వేస్తే సమ్మర్‌‌‌‌ డ్రింక్‌‌ రెడీ అవుతుంది. ఇది డీహైడ్రేషన్​ను తగ్గిస్తుంది. అజీర్తిగా ఉన్నా, జీర్ణక్రియ బాగా జరగాలన్నా కీరాదోసకాయ జ్యూస్​ను తాగితే సరిపోతుంది. ఈ జ్యూస్​వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండి మెరుపును సంతరించుకుంటుంది. 

– పాలకూరను ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది. పాలకూరలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, విటమిన్‌- ఎ, సి,  కె వంటివి మెండుగా ఉంటాయి. ఇది తరచుగా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. దీనిలో కూడా కేలరీలు తక్కువగా ఉంటాయి.  అధిక బరువుతో బాధపడుతున్నవారు రోజూ ఒక గ్లాస్‌ పాలకూర జ్యూస్‌ తాగితే మంచిది.

– క్యారెట్ జ్యూస్‌లో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి ఒకరోజుకు అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. క్యారెట్‌ జ్యాస్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, బరువు తగ్గడానికి తోడ్పడుతుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. పైబర్ కారణంగా ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండి ఆకలేయదు. ఫలితంగా ఇతర చిరుతిళ్లు, నూనె సంబంధిత పదార్థాల పైకి మనసు వెళ్లదు. మలబద్ధకాన్ని నివారిస్తుంది.  కేవలం 50 నుంచి 100 మిల్లీ లీటర్ల పచ్చి క్యారెట్ జ్యూస్‌ని ఆరు వారాల పాటు తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చని ఎన్​సీబీఐ తెలిపింది. 

– క్యాబేజీ జ్యూస్ తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంతో పాటు, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. రోజూ క్యాబేజీ జ్యూస్‌ తాగితే.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ కూడా కరుగుతుంది. క్యాబేజీలో ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. దీని కారణంగా.. చాలా సేపటి వరకు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. క్యాబేజీలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.

–  బరువు తగ్గాలనుకునేవారికి బీట్‌రూట్‌ జ్యూస్‌ చాలా బాగా పనిచేస్తుంది. బీట్‌రూట్‌ పోషకాల పవర్‌హౌస్‌. దీనిలో విటమిన్‌ బి6, విటమిన్‌ సి, ఫోలిక్‌ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ప్రొటీన్, ఐరన్, ఫాస్ఫరస్‌‌, డైటరీ ఫైబర్‌, గ్లుటమైన్, ఎమినో యాసిడ్స్, నైట్రేట్స్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా పేగుల్లోని చెడు బాక్టీరియాను తొలగించి..  జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.  దీనిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్ లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం భోజనం తర్వాత ఒక గ్లాస్‌ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే.. బరువు అదుపులో ఉంటుందట. 

– సొరకాయలో విటమిన్ సి, బి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి హాని చేసే కొవ్వు ఇందులో అస్సలు ఉండదు. బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్‌ ఆప్షన్. దీనిలో అధికంగా ఉండే పీచు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. సొరకాయ జ్యూస్‌ ఆకలిని తగ్గిస్తుంది. మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. శర కేలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది.