భూసేకరణ పరిహారం పంపిణీకి చర్యలు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

భూసేకరణ పరిహారం పంపిణీకి చర్యలు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
District Collector Bhavesh Mishra

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భూసేకరణలో అర్హులైన వారిని గుర్తించి  పరిహారం అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం సీఎంఓ ఇరిగేషన్ శాఖ ఓఎస్ డి మనోహర్, కాళేశ్వరం ఈఎన్ సీ నల్ల వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 100 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ లెవల్ మేర భూ సేకరణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జిల్లాలో 455 ఎకరాల 22 గుంటల మేరకు భూమి సేకరించాల్సి ఉందని, వీటిలో కొంత మేర ప్రభుత్వ భూమి మినహాయించి, ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాల్సిన భూముల వివరాలపై చర్చించారు. ప్రజలకు అవగాహన కల్పించి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, అవసరమైన నిధులను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని అన్నారు. ప్రభుత్వ భూమికి కూడా కొంత మంది పరిహారం కోరుతున్నారని, వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని తెలిపారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

జిల్లాలో ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కింద సేకరించిన భూ వివరాలు వెంటనే ప్రభుత్వం పేరు పై మ్యుటేషన్ పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ భూమిని సేకరించి హద్దులు నిర్దేశించాలని, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున  మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. భూ సేకరణ సమయంలో కొంత మంది డబుల్ పేమెంట్ కోసం ధరఖాస్తు చేసుకుంటున్నారని, ఇప్పటికే పరిహారం అందినప్పటికీ మరోసారి  చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించాలని, అర్హులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో  ఇరిగేషన్ శాఖ సిఎంఓ ఓఎస్ డి మనోహర్, కాళేశ్వరం ఈఎన్ సి వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, ఆర్డీఓ శ్రీనివాస్, నీటి పారుదల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.