అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి - ఎస్పీ కిరణ్ ఖరే

అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి - ఎస్పీ కిరణ్ ఖరే

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  జిల్లా పోలీసులు, పారామిలటరీ  బలగాలు అప్రమత్తంగా, సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే  అన్నారు. గురువారం కాళేశ్వరం పోలీస్ స్టేషన్ తో పాటు, సీఆర్ పీఎఫ్ క్యాంపును, అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ ను ఓఎస్డీ అశోక్ కుమార్ తో  కలిసి ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, సరిహద్దు పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికల నేపథ్యంలో  మావోయిస్టుల నుంచి ఏలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని  పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని, నగదు, మద్యం, ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతుందని, ఎవరూ  ఓటర్లను ప్రలోభపెట్టే   ఏలాంటి చర్యలకు దిగవద్దని,  పట్టుబడితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు.

సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేల కంటే  ఎక్కువ మొత్తంలో డబ్బులను తీసుకెళ్తే సీజ్ చేస్తామన్నారు. అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు డబ్బులను తీసుకెళ్తున్న వారు సరైన పత్రాలతో డబ్బులు తీసుకెళ్లాలని సూచించారు. నగదుకు సంబంధించిన తగిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంటే ఉంచుకోవడం మంచిదని అన్నారు. చెక్ పోస్ట్ అధికారులు, సిబ్బంది వాహనాల తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని, ఎప్పుడూ అప్రమత్తoగా వ్యవహరించాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో మహదేవ్ పూర్ సీఐ కిరణ్, కాళేశ్వరం ఎస్సై లక్ష్మణ్ రావు, సీఆర్ పీఎఫ్ ఎస్సై రామకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.