వెలిచాల యువసేన మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ....
ముద్ర ప్రతినిధి కరీంనగర్ :హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సేవాసమితి నాయకుడు గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని షామియానాలు ఏర్పాటు చేసి భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వెలిచాల కుటుంబం సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని, ముఖ్యంగా మండుతున్న ఎండలతో భక్తులు ఇబ్బంది పడకుండా రాజేందర్ రావు ఆదేశాల మేరకు వెలిచాల సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు గుమ్మడి రమేష్ వెల్లడించారు. గుమ్మడి రమేష్ తో పాటు జగిత్యాల జిల్లా మాలమహానాడు అధ్యక్షులు తరాల తిరుపతి, సేవా సమితి సభ్యులు, వెలిచాల రాజేందర్ రావు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.