కాంట్రవర్సీ కౌశిక్

కాంట్రవర్సీ కౌశిక్
  • ముదిరాజులపై అన్ పార్లమెంటరీ వర్డ్స్
  •  అంతకుముందు గవర్నర్, ప్రభుత్వ అధికారులపై
  • జెడ్పి చైర్ పర్సన్ నూ ఏడిపించాడు
  • రాష్ట్రవ్యాప్తంగా రాజుకుంటున్న రగడ
  • వివాదాస్పద వ్యాఖ్యలతో బిఆర్ఎస్ కు తీవ్ర నష్టం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న యువ నాయకుడు. వివాదాలకు కేరాఫ్. ఉడుకు రక్తంతో ఉద్రేకంగా వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువు. అతడే ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికైన హుజురాబాద్ నియోజకవర్గ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి. హుజరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు దీటైన నాయకున్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించి కౌశిక్ కు అవకాశం ఇచ్చారు. అతని శక్తికి మించి ఎమ్మెల్సీ, విప్  పదవులను కట్టబెట్టారు. అసలే దుందుడుకు స్వభావం దీనికి అధికారం తోడవడంతో అతనికి ఎదురు లేకుండా పోయింది. అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉండడంతో ఏది మాట్లాడిన చెల్లుతుందన్న భావనలోకి వెళ్లారు. ఈ స్వభావమే బిఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. తాజాగా ముదిరాజులను కులం పేరుతో విచక్షణ కోల్పోయి రాయడానికి వీలులేని పరుష పదజాలంతో దూషించిన ఆడియో వైరల్ కావడంతో మళ్లీ వివాదం చోటుచేసుకుంది.

 ఆడియో విన్న ముదిరాజులు రాష్ట్రవ్యాప్తంగా కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుల సంఘాలను తిట్టడానికే కౌశిక్ రెడ్డికి పదవులు అంటగట్టారా అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. ఖబడ్దార్ కౌశిక్ అంటూ మండిపడుతున్నారు. ముదిరాజులు కౌశిక్ రెడ్డి మాటలకు అంతే దీటుగా పరుష పదజాలంతో దూషిస్తున్నారు. కనీస సంస్కారం లేని కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని లేకుంటే వేల సంఖ్యలో కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర జనాభాలో 13.2% ఉన్న ముదిరాజులను అవమానపరిస్తే వచ్చే ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేసి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తామన్నారు. 

రైతు దినోత్సవం రోజు రైతును దూషిస్తూ
ఆబాది జమ్మికుంట రైతు వేదికలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కౌశిక్ రెడ్డి పై బుర్ర కుమార్ అనే  రైతు  అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రశ్నల వర్షం కురిపించాడు. దీంతో ఆగ్రహానికి గురై సిగ్గు, శరం లేదా అంటూ రైతును దూషించారు. ఈ వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. రైతు దినోత్సవం రోజు రైతును గౌరవించాల్సింది పోయి దూషించడమేంటని ప్రజలు మండిపడ్డారు.

గవర్నర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు
 జమ్మికుంట పట్టణం ఎం.పి.ఆర్  గార్డెన్ లో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు  రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. కౌశిక్ కామెంట్స్ పై బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత చోటుచేసుకుంది. గమనించిన బిఆర్ఎస్ అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఆయనతో గవర్నర్ కు క్షమాపణ చెప్పించడంతో వివాదం సద్దుమణిగింది.

జెడ్పి చైర్మన్ నూ ఏడిపించాడు
 అనంతరం కరీంనగర్ జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయతో వివాదం చోటుచేసుకుంది. దళిత బంధు పథకంలో భాగంగా కంబైన్డ్ యూనిట్ నెలకొల్పే క్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడని నిరసన వ్యక్తం చేసింది. అయినా కౌశిక్ పట్టు వదలలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన జడ్పీ చైర్మన్ కరీంనగర్ లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక మంత్రి గంగుల కమలాకర్ ఆమెను ఓదార్చి సర్ది చెప్పారు. అప్పుడు జడ్పీ చైర్ పర్సన్ కన్నీటి పర్యంతం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇదే కాకుండా జూపాక పంచాయతీ కార్యదర్శి తోటరాజుపై యూజ్ లెస్ ఫెలో అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు సైతం విమర్శలకు దారితీసింది. ఇవే కాకుండా హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తే జమ్మికుంట ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూలగొడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శలకు తావించాడు.పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై బిఆర్ఎస్ పార్టీ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. కౌశిక్ రెడ్డి కాంట్రవర్సీ లు టిఆర్ఎస్ పార్టీ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ కు నష్టం చేకూరేలా ఉంది. దీనిపై రాష్ట్ర అధినాయకత్వం కౌశిక్ ను ఎలా కట్టడి చేస్తుందో, ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.