పాత పెన్షన్ విధానం న్యాయమైనదే

పాత పెన్షన్ విధానం న్యాయమైనదే
  • సీఎం దృష్టికి తీసుకెళ్లి కేబినెట్లో చర్చకు ప్రయత్నిస్తా
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానం కావాలని అడగడం న్యాయమైనదేనని,  కేబినెట్ లో చర్చ జరిగేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 2003లో నోటిఫికేషన్ విడుదలై 2004 వ సంవత్సరం తర్వాత నియామకం అయిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 57/5 మెమో ప్రకారం పాత పెన్షన్ పరిధిలోకి తీసుక రావాలని కోరుతూ కొత్తపల్లి మండల కేంద్రములో ఏర్పాటు చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయుల సమావేశం కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ నుండి ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతం అవుతుందనీ, 2001లో సింహ గర్జన, 2009లో కరీంనగర్ నుండే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడోనంటూ ఉద్యమాన్ని మొదలుపెట్టారని వెల్లడించారు ఇక్కడి నుండి చేపట్టిన ప్రతీది సత్ఫలితాన్నిచ్చిందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల అంశం కూడా సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చకు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం అని, అందరి సమస్యల పట్ల మానవతా దృక్పథంతో సేవ చేసే వ్యక్తి అన్నారు.  ఉపాధ్యాయుల ఆకాంక్షలు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ తో కలిసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం అని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ కొత్తపల్లి ప్రజా ప్రతినిధులుతోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.