పాలమూరుకు పర్యావరణ అనుమతులు

పాలమూరుకు పర్యావరణ అనుమతులు
  • పాలమూరుకు పర్యావరణ అనుమతులు
  • లేఖ పంపిన కేంద్ర ఎన్విరాన్​మెంట్​ మంత్రిత్వ శాఖ
  • హర్షం వెల్లడించిన మంత్రి హరీశ్​

ముద్ర, తెలంగాణ బ్యూరో: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశకు పర్యావరణ అనుమతులు లభించాయి. రెండో దశ పర్యావరణ అనుమతులపై గురువారం  కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ లేఖ విడుదల చేసింది. ఈ ఏడాది జూన్​లో జరిగిన ఈఏసీ మీటింగ్​లో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కృష్ణా బేసిన్‌లోని కరువు, ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు తాగు, సాగునీటిని అందించడానికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదించింది. తొలిదశకు ఇప్పటికే అనుమతులు రావడంతో 1,226 గ్రామాలతోపాటు హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు తీర్చే పనులు కొనసాగుతున్నాయని, రెండో దశలో 6 జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా ప్రణాళిక రూపొందించామని, రెండో దశ పర్యావరణ అనుమతులకు 2017 అక్టోబర్‌ 11న టీవోఆర్‌ జారీ అయిందని, 2021 ఆగస్టు 10న ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను నిరుడు సెప్టెంబర్‌లో సీడబ్ల్యూసీకి సమర్పించామని, ఈ ఏడాది మార్చి 17న కేంద్ర విద్యుత్తు సంస్థ (సీఈఏ), జూన్‌ 5న సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ స్టేషన్‌ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) క్లియరెన్స్లు ఇచ్చాయని పేర్కొన్నారు.

 అయితే, పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించిన రెండో దశ అనుమతులపై కేంద్రం ఇబ్బంది పెడుతుందని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ఆరోపణలు చేస్తున్నది. తాజాగా మంత్రి కేటీఆర్​ సైతం కేంద్రానికి లేఖ రాశారు. అయితే, ఈఏసీ మీటింగ్​లో చర్చల అనంతరం పాలమూరు–రంగారెడ్ది రెండో దశకు పర్యావరణ అనుమతులు జారీ చేస్తున్నట్లు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  కాగా,  కరువు పీడిత ప్రాంతాలైన నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆశాకిరణంలాంటిదని ప్రభుత్వం ఇప్పటికే చెప్తున్నది. 12.5 లక్షల ఎకరాలకుపైగా భూమికి నీటిని అందించడంతో పాటు అనేక గ్రామాలకు, హైదరాబాద్ నగరం, పరిశ్రమల తాగునీటి అవసరాలను తీర్చడం పథకం ఉద్దేశమని, ప్రాజెక్టుకు జీవితాలను మార్చే సామర్థ్యం ఉందంటూ సీఎం కేసీఆర్​ పలుమార్లు చెప్పుకొచ్చారు. 

కుట్రలను ఛేదించి.. కేసులను అధిగమించి : మంత్రి హరీశ్​రావు ట్వీట్​
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై మంత్రి హరీశ్​రావు ట్వీట్​ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా కుట్రలను ఛేదించి..కేసులను అధిగమించి అనుమతులు తెచ్చుకున్నామంటూ వెల్లడించారు. దీంతో దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానుందని, పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించ‌డం మరో అపూర్వ, చారిత్రాత్మక విజ‌యమని కొనియాడారు. పాలమూరు బిడ్డల దశాబ్దాల కల సాకారమైన ఈ సమయం మాట‌ల్లో వ‌ర్ణించ‌లేని మ‌ధుర ఘ‌ట్టం అని, పాల‌మూరు బీళ్ల దాహార్తిని తీర్చే ప్రజ‌ల త‌ల‌రాత‌ను మార్చే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావ‌డం అపూర్వ ఆనందాన్ని ఇస్తున్నదని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు.