కెసిఆర్ కు మిగిలింది మూడు రీళ్ల సినిమానే... వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే... పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

కెసిఆర్ కు మిగిలింది మూడు రీళ్ల సినిమానే... వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే...  పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

(కేసముద్రం- ముద్ర): కెసిఆర్ ప్రభుత్వానికి ఇక మిగిలింది మూడు రీళ్ళ సినిమా నేనని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా మద్దతుతో అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడం తధ్యమని పిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండలో రాత్రి బస చేసి బుధవారం ఉదయం మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో దోపిడీ విపరీతంగా పెరిగిందని, దోపిడీ, నియంత పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డబ్బు, మద్యం, పోలీస్ అండతో పరిపాలన సాగిస్తున్నాడని, నియంత పాలన సాగించిన వారంతా ఎలా కాలగర్భంలో కలిసిపోయారో చరిత్ర ద్వారా తెలుసుకోవాలని ఆయన అన్నారు.

రాష్ట్రంలో భవిష్యత్ తరాలు చైతన్యవంతులు కాకుండా ఉండేందుకు 6 వేలకు పైగా ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసారని ఆరోపించారు. పాఠశాలలకు మూసివేసిన ప్రభుత్వం, అందుకు భిన్నంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 3000 బార్లను 60 వేల బెల్ట్ షాపులను తెరిచిందని ఆరోపించారు. ప్రజల బాగోగులు చూడాల్సిన సీఎం ప్రగతి భవన్ పేరుతో గడిని నిర్మించుకొని, నియంత తరహాలో పాలన సాగిస్తున్నాడని దుయ్యబట్టారు. ఎందరో నియంతలు ప్రజా ఆగ్రహానికి గురై కాలాగర్భంలో కలిశారని, అదే తరహాలో కెసిఆర్ కూడా కలవక తప్పదని చెప్పారు. కెసిఆర్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, కెసిఆర్ చేతిలో రాయి ఎప్పుడు.. ఎందుకు.. ఎవరికి తగులుతుందో తెలియదని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబిఐ చేత విచారణ జరిపే క్రమంలో, గతంలో తాము కాంగ్రెస్ నుంచి 12 మంది టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారంపై కూడా విచారణ జరపాలని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. తాజా కేసుతోపాటు ఆ కేసును కూడా సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వామపక్షాల పట్ల చిన్న చూపు చూసిన కెసిఆర్ బిజెపి బూచి చూపి వామపక్షాలను దగ్గరికి తీసుకున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన వారికి పదవులు ఇవ్వకుండా, తెలంగాణ ద్రోహులకు అందలమెక్కించాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ ను గద్దె దింపడానికి టిఆర్ఎస్, బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ ఏకం కావాల్సిన పరిస్థితి ఉందన్నారు.