రాక్షస రాజ్యం పోవాలి రామ రాజ్యం రావాలి- బండి సంజయ్

రాక్షస రాజ్యం పోవాలి రామ రాజ్యం రావాలి-  బండి సంజయ్

ముద్ర,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శనివారం మండల బిజేపి అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  చత్రపతి శివాజీ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర బిజేపి అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ మొదటగా చత్రపతి శివాజీ శిలాఫలకం ఆవిష్కరించి అనంతరం విగ్రహావిష్కరణ చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ జై శ్రీరామ్ జై భవాని అంటూ మొగలి చక్రవర్తి కాలంలో సైనికులు శివ లింగంపై  మూత్రం పోస్తున్న దృశ్యం చూసిన  చిన్నవాడైనా చత్రపతి శివాజీ ఒంటి చేతితో కత్తిని పట్టుకొని ఎవరైతే శివలింగాన్ని అవమానపరిచారో వారిని తరిమికొట్టాడని ధర్మం కోసం యుద్ధం చేశాడని అన్నారు. అదేవిధంగా ఇస్లాం ను కించపరిచిన హిందువులు వస్తారని క్రైస్తవులను కించపరిచిన హిందువులు వస్తారని  హిందూ దైవం అయ్యప్ప ను  ఒక్కడు వచ్చి కించపరిస్తే మాత్రం ఎవ్వరు కూడా రాలేరని బిజేపి మాత్రం ఎప్పటికీ హిందువుల కొరకు అన్ని మతాల కొరకు పోరాటం చేస్తుందన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం పిల్లలు పుట్టగానే సరస్వతి వద్ద అక్షరాభ్యాసం చేస్తామని   వారు పెరిగి పెద్దయ్యాక డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అయి ప్రయోజకులు అయితారని అలాంటి సరస్వతి అమ్మను కూడా కొందరు కించపరుస్తున్నారన్నారు. అదేవిధంగా గ్రామ గ్రామాన చత్రపతి శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం రావాలని పేదోళ్ల రాజ్యం బాగుపడాలని పేర్కొన్నారు. ప్రజల కొరకు ధర్మం కోసం ప్రాణం ఉన్నంతవరకు పనిచేయాలని మనము చనిపోయిన గాని మన వ్యక్తిత్వాన్ని ప్రజలు తలుచుకోవాలని ఆ విధంగా పార్టీ కోసం పని చేయాలని సూచించారు. గ్రామ గ్రామాన తిరుగాలని కార్యకర్తలకు సూచించారు. టైం పాస్ కోసం పాలిటిక్స్ చేయవద్దని  అన్నారు. మీ ఆశీర్వాదం ఉన్నంతవరకు పేద ప్రజల కోసం అనునిత్యం పోరాడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, గుండాడి వెంకట్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, బంధారపు లక్ష్మారెడ్డి, శ్రీనివాసు, సల్ల సత్యం రెడ్డి కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.