పల్లెల అభివృద్ధే ప్రధాన లక్ష్యం - ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

పల్లెల అభివృద్ధే ప్రధాన లక్ష్యం - ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో రూ.1.30 కోట్లతో  అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డిల చేతులమీదుగా శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని, అన్ని సదుపాయాలు, హంగులతో పల్లెలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయని అన్నారు. గ్రామంలో గతంలో దాదాపు కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి, తిరిగి ఇప్పుడు కోటి 30 లక్షలతో పనుల నిర్మాణం చేసుకోవడం చాలా సంతోషకరమని చెప్పారు. గొర్లవీడు ప్రాంత రైతులకు, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యార్థం నెరేడుపల్లి గ్రామం వద్ద మొరంచవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామంలోని మున్నూరు కాపు సంఘం వారు భవనం కావాలని కోరగా తక్షణమే ఎమ్మెల్యే స్పందించి నిధులను ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గొర్లవీడు గ్రామంలో గల శ్రీ గంగాధరేశ్వర స్వామి వారి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గొర్లవీడు గ్రామ సర్పంచి శంకర్, ఉప సర్పంచ్ మైనోద్దీన్, జడ్పీ వైస్ చైర్మన్ కల్లెడ శోభ రఘుపతిరావు, ఎంపీపీ మందల లావణ్య, నాయకులు సాగర్ రెడ్డి, బొనగాని రమేష్, రవి, నర్సయ్య, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.