సేవకుడిగా పనిచేస్తా: చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

సేవకుడిగా పనిచేస్తా: చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

 58వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హనుమకొండ: ఈరోజు హనుమకొండలోని కేయూ ఎంప్లాయిస్ కాలనీలో కాలనీ దర్శన్ లో భాగంగా 10 లక్షల రూపాయలతో సిసి రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి, ధనిక కుటుంబాలు ఉంటాయని, అందరినీ పరిగణలోకి తీసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇప్పటివరకు రూ.8 కోట్లతో సిసి రోడ్, డ్రైనేజీ లైన్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టమని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో సేవకుడిగా పని చేసానని, మళ్ళీ అవకాశం ఇస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేస్తానని అన్నారు.

కాలనీ వాసులు మరిన్ని పనుల కోసం వినతి పత్రం ఇవ్వగా ఆ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొంతమంది వలసవాదులు ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. నేను మీలో ఒక కుటుంబ సభ్యునిగా, సోదరుడిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నానని అన్నారు. చేసిన పనులను గుర్తించుకొని ఆశీర్వదించాలని విద్యావంతులకు, మేధావులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక 58వ డివిజన్ కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజ్, డివిజన్ అధ్యక్షులు నరసింహారావు (చిన్న) కాలనీ అధ్యక్షులు ప్రొఫెసర్ సాయిలు, ప్రధాన కార్యదర్శి కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.