అమ్ముడుపోయారు అన్నాం కానీ, పేర్లు చెప్పలేదుగా

అమ్ముడుపోయారు అన్నాం కానీ, పేర్లు చెప్పలేదుగా

క్రాస్ ఓటింగ్‌కు ఎవరు పాల్పడ్డారో అందరికీ తెలుసునన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారనే సజ్జల అన్నారు తప్పించి, పేర్లు చెప్పలేదన్నారు. డబ్బులు తీసుకున్నవాళ్లే భుజాలు తడుముకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎవరు పార్టీ వీడినా ఇబ్బంది లేదని.. పార్టీ పటిష్టంగానే వుందని కాకాణి స్పష్టం చేశారు.అంతకుముందువైసీపీ బహిష్కృత నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కౌంటరిచ్చారు ఎంపీ నందిగం సురేష్. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఉండవల్లి శ్రీదేవి విమర్శలు చేసే ముందు ఆలోచించాలని హెచ్చరించారు. మా దగ్గర అన్ని ఆధారాలున్నాయని ఆయన స్పష్టం చేశారు.తమ నుంచి ఉండవల్లి శ్రీదేవికి ఎలాంటి ఆపద వుండదని.. ఆమె పార్టీ స్టాండ్ దాటారని, అందుకే వేటు పడిందని నందిగం సురేష్ అన్నారు. టీడీపీకి ఓటేసి.. అమరావతి రాజధాని అంటూ శ్రీదేవి ఏదేదో మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు.

ఉండవల్లి శ్రీదేవికి ఏపీలో పూర్తి రక్షణ వుందని.. ఆమెకు టీడీపీ నుంచే ప్రమాదమని సురేష్ హెచ్చరించారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడారని ఆయన ఆరోపించారు. జగన్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఎవ్వరి వల్లా కాదని సురేష్ తేల్చిచెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్  చేసినట్టుగా  ఆరోపణలు  చేసిన  వైసీపీ నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని  ఎమ్మెల్యే  ఉండవల్లి శ్రీదేవి చెప్పారు. ఆదివారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మూడు రోజులుగా తనపై  సోషల్ మీడియాలో  అసత్య ప్రచారం చేస్తున్నారన్నారని కొన్ని మీడియా చానెల్స్,  కొందరు వైసీపీ నేతలు దారుణంగావ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని శ్రీదేవి స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలో ఉన్న తనను రాజకీయంగా వైసీపీ నేతలు  టార్గెట్  చేశారని  ఆమె  ఆరోపించారు. డబ్బులు ఇచ్చి తనపై, కార్యాలయంపై దాడులు  చేయించారన్నారు.

తాను  ఎమ్మెల్యేగా  విజయం సాధించిన రోజు నుండి తనను వేధిస్తున్నారన్నారని శ్రీదేవి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఎవరికి ఓటు చేసిందో వైసీపీ నాయకత్వానికి  తెలుసునని ఉండవల్లి శ్రీదేవి  చెప్పారు. 22వ ప్యానెల్ లో జనసేన ఎమ్మెల్యే లేరా, విశాఖ జిల్లాకు చెందిన అసంతృప్త ఎమ్మెల్యే లేరా  అని ఉండవల్లి శ్రీదేవి  ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు నుండే తనపై కుట్రలు చేస్తున్నారని ఆమె  ఆరోపించారు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నట్టుగా  నిరూపిస్తారా అని శ్రీదేవి సవాల్  విసిరారు. ఈ విషయమై అమరావతి మట్టిపై ప్రమాణం చేద్దామా అని  ఆమె  వైసీపీ నేతలను కోరారు. తనను గెలిపించిన ప్రజల కోసం ఇక నుండి పోరాటం చేస్తానన్నారు. తాను ఒక డాక్టర్ అని, తన భర్త కూడా డాక్టర్ అని ,తమకు రెండు ఆసుపత్రులు కూడా  ఉన్నాయన్నారు. తాను డబ్బులు తీసుకొని ఓటు వేయాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే శ్రీదేవి  చెప్పారు. తనకు  ఏమైనా జరిగితే  ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డిదే బాధ్యత అని శ్రీదేవి వ్యాఖ్యానించారు.