బీజేపీ  నేతలపై కేసుల్లేవా.. వారికి శిక్షలేవి?: రేవంత్‌ రెడ్డి

బీజేపీ  నేతలపై కేసుల్లేవా.. వారికి శిక్షలేవి?: రేవంత్‌ రెడ్డి

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అక్రమంగా అనర్హత వేటువేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అప్పీల్‌ చేసుకునేందుకు ఆయనకు సూరత్‌ కోర్టు 30 రోజుల గడువు ఇచ్చినప్పటికీ.. ఆగమేఘాల మీద లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేసిందని మండిపడ్డారు. కోర్టు గడువిచ్చింది కాబట్టే పోలీసులు రాహుల్‌ని అరెస్టు చేయలేదని, లేకుంటే ఎప్పుడో జైల్లో పెట్టేవారన్నారు. రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్షలో రేవంత్‌ మాట్లాడారు. డబుల్‌ ఇంజిన్‌ అంటే ఒకటి అదానీ, రెండు ప్రధాని అని విమర్శించారు.

ప్రధానిగా అవకాశం వచ్చినా రాహుల్‌ గాంధీ తీసుకోలేదని చెప్పారు. అదానీపై మాట్లాడినందుకే ఆయనపై ఎంపీగా అనర్హతవేటు వేశారని ఆరోపించారు.  ''రాహుల్‌ గాంధీని చూస్తే నరేంద్రమోదీ భయపడుతున్నారు. బీజేపీ  నేతలపై ఎన్ని కేసులు లేవు? క్షమాపణలు చెప్తే ఉరిశిక్ష నిలిపివేస్తామని అప్పట్లో భగత్‌సింగ్‌కు బ్రిటిష్‌వారు అన్నారు. కానీ, ఆ వీరయోధుడు అందుకు నిరాకరించారు. దేశ పౌరుషాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఉరికంబం ఎక్కారు. అయన్ని స్ఫూర్తిగా తీసుకున్న రాహుల్‌గాంధీ కూడా చేయని తప్పునకు క్షమాపణలు చెప్పబోరు'' అని రేవంత్‌ పునరుద్ఘాటించారు.