మాముళ్ల ధరలు పెంచేశారట..

మాముళ్ల ధరలు పెంచేశారట..
  • కొత్త సార్లూ... కొత్త ధరలు..?
  • సిరిసిల్ల రవాణాశాఖ లో మాముళ్ల చర్చ..
  • ఆర్డీఏ ఏజెంట్ల వాట్సప్ గ్రూపులో చాటింగ్ చర్చనీయంశం..
  • ఒక్కో డ్రైవింగ్‌‌ లైసెన్స్‌‌ సర్కారు ఫీజు కంటే రెండు రెట్లు అధికం
  • వాహనదారుల జేబులకు చిల్లులకు రంగం సిద్దం
  • సిరిసిల్ల బదిలిపై వచ్చిన అధికారుల ఆదేశాలతోనే మాముళ్ల ధరలు పెంపు
  • సిరిసిల్ల రవాణాశాఖ అధికారులపై ఇప్పటికే మంత్రి పొన్నం దృష్టికి..
  • సిరిసిల్ల డీటీవో లక్ష్మణ్‌‌ తో ఇసుక రవాణదారుడి ఫోటో చర్చనీయంశం
  • పొన్నం దృష్టికి  తీసుకెళ్లిన కాంగ్రెస్‌‌ నేతలు

ముద్ర,రాజన్నసిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లాలో రవాణాశాఖ మాముళ్ల ధరల చర్చ మొదలైంది. నిన్న మొన్నటి వరకు గుట్టుగా ఉన్న సిరిసిల్ల రవాణాశాఖ ఒక్కసారిగా రాజన్నసిరిసిల్ల జిల్లా లో చర్చనీయంశంగా మారుతుంది. సిరిసిల్ల డీటీవో గా పని చేసిన కొండల్‌‌ రావు , ఎంవీఐ కిషోర్‌‌ లు బదిలి కాగా వీరి స్థానంలో డీటీవోగా లక్ష్మణ్‌‌, ఎంవీఐ గా శోభన్‌‌, ఏ ఏంవీఐ రజినిదేవిలు సిరిసిల్లకు వచ్చారు. వీరి రాకతో సిరిసిల్ల ఆర్టీవో ఏజెంట్లు వచ్చి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అధికారులతో చర్చించారు. సిరిసిల్ల డీటీవో లక్ష్మణ్‌‌ ను బోయినిపల్లి మండలంకు చెందిన బీఆర్ఎస్‌‌ నేత, ఎంపి సంతోష్‌‌రావు తండ్రి రవీందర్ రావు అనుచరుడు వచ్చి కలిసి.. ఫోటో దిగి సోషల్‌‌ మీడియాలో పెట్టడంతో రాజకీయ చర్చకు దారి తీసింది. సిరిసిల్ల  డీటీవో గా వచ్చిన లక్ష్మణ్‌‌ ఎవరు..ఎక్కడి నుంచి వచ్చారు.. ఇసుక రవాణదారులతో ఏం సంబంధాలు ఉన్నాయి.. జోగినిపల్లి రవీందర్‌‌ రావు అనుచరుడితో ఎలాంటి పరిచయాలు ఉన్నాయి అని ఆరా తీసి.. ఈ ఫోటోలను మంత్రి పొన్నం ప్రభాకర్‌‌కు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌‌ నేతలు పంపించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. సిరిసిల్ల ఆర్టీఏ ఏజెంట్ల వాట్సప్ గ్రూపులో చాటింగ్‌‌, ఆర్టీవో అధికారుల మాముళ్ల పెంపు అంశాలు చర్చకు వస్తున్నాయి. మొన్నటి వరకు లైసెన్స్‌‌ లర్నింగు కు ప్రభుత్వ రుసుం రూ.450 అందనంగా రూ.600 తీసుకునే వారు. లైసెన్స్‌‌ టూ విలర్, ఫోర్‌‌ విలర్ కు ప్రభుత్వ రుసుం రూ.1335 అదనంగా రూ.1550 తీసుకోవగా కొత్తగా వచ్చిన అధికారుల ఆదేశాలతో ఈ అదనపు వసూళ్లు రూ.1550 నుంచి రూ.2550 చేసినట్లు వాట్సప్‌‌ చాటింగ్‌‌ లో పేర్కొన్నారు. ఇప్పటి నుంచి వాహనదారు నుంచి తక్కువ పైసలు తీసుకోవద్దని, అధికారులు పెంచిన ధరలకు అనుగుణంగా తీసుకోవాలని ఎల్లారెడ్డిపేటకు చెందిన ఓ డ్రైవింగ్‌‌ స్కూల్‌‌ ఓనర్ వాట్సప్‌‌ గ్రూపులో పెట్టారు. విత్‌‌ ఔట్ డీఎల్‌‌ టెస్టుల వారు ఫలాన సమయం ప్రకారం పెట్టుకోవాలని, ఓల్డ్‌‌ ఎల్ఎల్‌‌ఆర్ (లర్నర్ లైసెన్స్‌‌ రిజిస్టేషన్) కు పాత రేట, కొత్త ఎల్ఎల్ఆర్ కు కొత్త రేటు అని పేర్కొన్నారు. కావును ఏజెంటు మిత్రలందరు తక్కువ రేట్లకు లైసెన్స్ లు చేయవద్దని , ఇది అర్డర్‌‌ అని వాట్సప్‌‌ గ్రూపులో పెట్టారు. ఈ వాట్సప్‌‌ చాట్‌‌ స్క్రీన్ చాట్ లు లీక్ కావడంతో.. సిరిసిల్ల లో రవాణ శాఖ అధికారుల తీరుపై.. దోపిడిపై చర్చ కొనసాగుతుంది. ఈ శాఖకు ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకరే మంత్రిగా వ్యవహరిస్తున్న.. ఇంత భయం, భక్తి లేకుండా సిరిసిల్ల రవాణా శాఖ అధికారులు తమ మాముళ్ల రేట్లను పెంచి.. వసూళ్లకు స్కెచ్‌‌ వేస్తుండటంతో ప్రభుత్వానికి, మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ శాఖకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

డీటీవో గారు లేరు.. ఈ విషయం మా దృష్టికి రాలేదు..శోభన్.ఎంవీఐ. సిరిసిల్ల


సిరిసిల్ల రవాణా శాఖ మాముళ్లు విషయం ఆర్టీవో ఏజెంట్ల వాట్సప్‌‌ గ్రూపులో చర్చించిన విషయం డీటీవో లక్ష్మణ్‌‌ ను వివరణ కోసం ముద్ర ఫోన్‌‌ చేయగా.. స్పందించలేదు. దీంతో ఎంవిఐ శోభన్ కు పోన్‌‌ చేయగా.. డీటీవో సర్‌‌ లేరని, ఈ అదనపు వసూళ్ల వ్యవహారం తమ దృష్టికి రాలేదన్నారు.