ఒక్క ఓటుతో 3 పార్టీలకు బుద్ది చెప్పాలి

ఒక్క ఓటుతో 3 పార్టీలకు బుద్ది చెప్పాలి

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: ఒక్క ఓటుతో తెలంగాణ ప్రజలు మూడు పార్టీలకు బుద్ది చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం లోపాయకారి ఒప్పందాలతో పనిచేస్తున్నాయని, ఆ క్రమంలోనే ఎంఐఎం రాజాసింగుపై పోటీ పెట్టలేదన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సీపీఐ పనిచేస్తుందన్నారు. శుక్రవారం ఖమ్మం సీపీఐ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ  బీజేపీ, బీఆర్ఎస్ లది పైకి గుద్దులాట లోన ముద్దులాట చందంగా ఉందన్నారు. ఎక్కడైనా సన్ స్ట్రోక్ ఉంటుందని కానీ తెలంగాణలో కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్  ఉందన్నారు. మహిళలు గౌరవ వ్యాపారం చేయాలని, కవిత లిక్కర్ సిండికేట్ లో పని చేయడం ఏంటని ప్రశ్నించారు.  దేశ వ్యాప్తంగా ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నామని ఆ క్రమంలోనే తెలంగాణలో ఒక్క స్థానానికే పరిమితమై కాంగ్రెస్ తో  ఎన్నికల ఒప్పందం చేసుకున్నామన్నారు.  తెలంగాణ ప్రజలు అవినీతినైనా సహిస్తారు కాని అహంకారాన్ని సంహించరన్నారు.

ఎమ్మెల్యేలకు ప్రవేశంలేని అసెంబ్లీ ఎందుకని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కేబినెట్లో తెలంగాణ ద్రోహులే ఎక్కువగా ఉన్నారని, ఆత్మహత్యలను సైతం వక్రీకరిస్తున్నారని, నీళ్ళు, నిధులు, నియమకాలు ప్రజలకు దక్కలేదన్నారు. దమ్ముంటే కేసీఆర్ తెలంగాణ  ఉద్యమానికి ఊపిరిఊదిన ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ప్రచారం నిర్వహించాలని సవాల్ విసిరారు. మాజీ ఎంపీ వివేక్ బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరడంతోనే పది రోజుల్లోనే ఆదాయ పన్ను శాఖ దాడులు జరిగాయన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో సీపీఐకి కాంగ్రెస్ పార్టీ మద్దనివ్వడంలేదని అపవాదు సరికాదన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం సీపీఐ కృషిచేస్తుందన్నారు.

సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావుకు అజయ్ కుమార్  కుమారుడైనంతమాత్రానే బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తారనుకోవడం అనవసర ప్రచారమన్నారు. సీపీఐ నేత నాగేశ్వరరావు మామిడి చెట్టు లాంటివాడని అలాంటి వ్యక్తికి అజయ్ కుమార్ అనే గంజాయి మొక్క వచ్చిందని దుయ్యబట్టారు. తెలంగాణలో మొదటి ఓటమి చెందేది ఇంగ్లీష్ అక్షరాల ప్రకారం అజయ్ అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో పువ్వాడ నాగేశ్వర రావు పోటీ చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో తనను పోటీకి దింపారని నారాయణ చెప్పారు. పొత్తు  ధర్మం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులకు సీపీఐ సహకరిస్తుందని, ఖమ్మంలో అతిక్రమిస్తే  పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.  ఈ మీడియా సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సహాయ కార్యదర్శి  సురేష్, కార్యవర్గసభ్యులు  జితేందర్​రెడ్డి, జానిమియా పాల్గొన్నారు.