బర్రెలక్కకు భద్రత

బర్రెలక్కకు భద్రత
  • వన్​ప్లస్ వన్​ గన్ మెన్ కేటాయించండి
  • పోలీస్ శాఖకు హైకోర్టు ఆదేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో: కొల్లాపూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. బర్రెలక్కకు భద్రత కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్కకు రక్షణ కల్పించాలని, ఆమె నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లకు ఒక గన్‌మెన్‌తో భద్రత ఇవ్వాలని పోలీస్ శాఖకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో కేవలం గుర్తింపు ఉన్న పార్టీల నాయకులకే భద్రత ఇస్తేనే సరిపోదని, ముప్పు ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు కూడా రక్షణ కల్పించాలని ఆదేశించింది. అభ్యర్థుల భద్రత, బాధ్యత ఎన్నికల సంఘానిదేనని న్యాయస్థానం తెలిపింది. అభ్యర్థుల భద్రతపై డీజీపీ, ఈసీ కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 

 కొల్లాపూర్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోనివ్వడం లేదని బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ నెల 21న కొల్లాపూర్ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో బర్రెలక్క తమ్ముడిపై కొందరు దుండగులు దాడిచేసిన విషయం తెలిసిందే. దీంతో తనకు 2+2 గన్‌మెన్లతో భద్రత కల్పించాలని కోరుతూ బర్రెలక్క హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల వేళ దాడులు జరుగుతున్నాయి. మొదట మొదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి జరగ్గా.. ఆ తర్వాత అచ్చంపేట ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి జరిగింది. ఆ తర్వాత కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిరీషపై దాడి జరిగింది. ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగిన సమయంలోనే అభ్యర్థుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తూ భద్రతను పెంచింది ప్రభుత్వం. కాగా, శిరీష స్వతంత్ర అభ్యర్థి కావడంతో ఆమెకు ఎలాంటి భద్రతను కల్పించలేదు. బర్రెలక్క మీద జరిగిన దాడి గురించి తెలుసుకుని స్వచ్ఛందంగా పలువురు న్యాయవాదులు కూడా ముందుకు వచ్చారు. అంతర్జాతీయ న్యాయవాదుల సంఘం నాయకులు కావేట శ్రీనివాసరావు, కరణం రాజేశ్, ఆదిత్య దొడ్డల మద్దతు ప్రకటించారు. బర్రెలక్కపై, ఆమె తమ్ముడి మీద దాడిచేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శిరీషకు 2 + 2 గన్ మెన్లతో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో హై కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్​ విచారించిన హైకోర్టు.. వన్​ ప్లస్​ వన్​ భద్రతను కేటాయించాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది.