అనుకొని ప్రమాదాలు... ఐదుగురు దుర్మరణం

అనుకొని ప్రమాదాలు... ఐదుగురు దుర్మరణం
  • ఖమ్మం లో రోడ్ టెర్రర్
  • బాధిత కుటుంబాల్లో విషాదం

ముద్ర ప్రతినిధి ఖమ్మం/ కొణిజర్ల: ఖమ్మం లో జరిగిన రోడ్డు ప్రమాదాలు పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. కొణిజర్ల ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడి కక్కడే ముగ్గురు మృతిచెందగా ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి‌. గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన  చోటు చేసుకుంది. కొణిజర్ల మండల కేంద్రం సమీపంలోని పెట్రోల్ బంకు ఎదురుగా లారీ- కారు ఢీకొన్న సంఘటనలో పారుపల్లి రాజేష్, సుజాత దంపతులు, వారి కుమారుడు అశ్విత్ (13) మృతి చెందారు. మరో కుమారుడు గాయపడటంతో వైద్య చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజేష్ దంపతుల స్వస్థలం వైరా మండలం విప్పలమడక గ్రామం. ప్రస్తుతం రాజేష్ హైద్రాబాద్ పార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. స్వగ్రామం వస్తుండగా ఈ ప్రమాధం జరిగింది. ఈ సంఘటనతో విప్పల్ మడక గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.

మరో ప్రమాదం: పెనుబల్లి మండలం వీఎం బంజర వద్ద బుధవారం అర్ధరాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి దీంతో లారీల క్యాబిన్లు నుజునుజై డ్రైవర్లు అందులో ఇరుక్కుపోయారు. సుమారు రెండు గంటల పాటు అత్యవసర వైద్య వాహనాల సిబ్బంది, పోలీసులు శ్రమించి డ్రైవర్లను బయటకు తీశారు. అయినప్పటికీ ఫలితం లేదు. డ్రైవర్లు ఇద్దరు మరణించారు.