సైక్లింగ్​లో తగ్గేదేలే..

సైక్లింగ్​లో తగ్గేదేలే..
  • మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మా...
  • పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ..
  • కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు..
  • మహాపురుషులౌతారు...
  • తరతరాలకి తరగని వెలుగౌతారు.. 
  • అన్నాడో  సినీ కవి..

ఈ మాటలను నిజం చేస్తూ నేటి యువత తమదైన రంగంలో దూసుకుపోతున్నారు. అలాంటి కోవలో మొదటిగా నిలుస్తాడు తెలంగాణ బిడ్డ దేవాన్ష్​. బిఎంఎక్స్​ సైక్లింగ్​రేసింగ్​లో విశేష ప్రతిభ కనబరుస్తూ.. ప్రపంచ ఛాంపియన్​షిప్​లో రెండుసార్లు అవకాశం సంపాదించుకున్నాడు. అటు సైక్లింగ్​లోనూ, ఇటు చదువులోనూ ముందుండటమే కాకుండా సోషల్​ సర్వీస్​ వంటి వాటిలో తనదైన ముద్ర వేసి ముందుకు సాగుతూ ఆల్​రౌండర్​ అనిపించుకుంటున్నాడు దేవాన్ష్​.

 వివరాల్లోకి వెళితే..
దేవాన్ష్​ది యాదాద్రి, భువనగిరి జిల్లాలోని పులిగిల్ల గ్రామం. కొలను కమలాకర్​ రెడ్డి, జ్యోతిలు అతని తల్లిదండ్రులు. వీరు దేవాన్ష్​ చిన్నతనంలోనే  ఐర్లాండ్​లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఐర్లాండ్​లోని డబ్లిన్​లోని సెంట్​విన్సెంట్​ క్యాస్సేల్నాక్​ కాలేజీలో ఏడో తరగతి చదవుతున్న దేవాన్ష్​ క్రీడలతో పాటు చదువులోనూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నాడు.  ఇతను చాలా బ్రిలియంట్​.. పాఠశాల విద్యలో ఎప్పుడూ మొదటి స్థానమే.. అంతేకాదు ఒకరికి సాయం చేయడంలోనూ, సోషల్​ వర్క్​లోనూ, ఆటపాటల్లోనూ ఎప్పుడూ ముందంజలో ఉంటాడు. కరోనా పాండమిక్​ సమయంలో, ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితుల్లో తమ కుటుంబంతో కలిసి పిక్నిక్​కు వెళ్లాడు దేవాన్ష్​. అదో క్లబ్​.. అక్కడ అతను సైక్లింగ్​ ట్రాక్​ చూశాడు. దాన్ని చూసి దేవాన్ష్​కు సైక్లింగ్​ చేయాలనే ఉత్సాహం కలిగింది. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పాడు. ఈ విషయాన్ని తండ్రి సీరియస్​గా తీసుకుని దేవాన్ష్​ను ప్రోత్సహించాడు. అప్పటికి దేవాన్ష్​ వయసు పది సంవత్సరాలు. 

మరుసటిరోజు దేవాన్ష్​ తండ్రి కమలాకర్​.. ఆ క్లబ్​ట్రాక్​ ఛైర్మన్​ జాన్​ఒ రైలీతో మాట్లాడారు. అతను దేవాన్ష్​ను ట్రాక్​ టెస్ట్​ చేశాడు. అది దేవాన్ష్​కు చాలా నచ్చింది.. బీఎంఎక్స్​ సైక్లింగ్​ బాగా చేశాడు. ఇది జరిగిన మూడు రోజుల్లోనే లూకస్​ క్లబ్​ రేస్​లో పాల్గొన్నాడు దేవాన్ష్​.. అంతే.. ఇక వెనుదిరిగి చూడలేదు. అదే లూకస్​బిఎంఎక్స్​ క్లబ్​ ద్వారా శిక్షణ తీసుకుని.. తనదైన శైలిలో దూసుకుపోవడం మొదలుపెట్టాడు. కేవలం 36 నెలల్లోనే రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్​షిప్​లలో పాల్గొన్నాడు.  400 మీటర్ల పొడవైన ఎగుడు దిగుడు ట్రాక్​లో స్టార్టింగ్​ హిల్​ పాయింట్​ నుండి.. ఫినిషింగ్​ లైన్​ వరకూ ఎంతో శక్తిని కూడగట్టుకుని సైక్లింగ్​ చేయాల్సి ఉంటుంది. దీనిలో గెలవాలంటే 34 సెకన్లలో 400 మీటర్ల పొడవైన ట్రాక్​ను ఛేదించాల్సి ఉంటుంది. దేవాన్ష్​ రెండో ప్రయత్నంలోనే 37 సెకన్లలో తన రేస్​ను పూర్తిచేశాడు. ప్రపంచ ఛాంపియన్​షిప్​ను కైవసం చేసుకోవాలంటే దేవాన్ష్​ మరో మూడు సెకన్ల ముందుగానే సైక్లింగ్​ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దేవాన్ష్, శిక్షణ తీసుకుంటూ.. పట్టుదలగా ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. 50 దేశాల నుండి ప్రాతినిధ్యం వహిస్తోన్న 112 మంది సైక్లిస్ట్​లతో దేవాన్ష్​తలబడుతున్నాడు. ఈ పోటీ చాలా క్లిష్టంగా ఉంటుంది.

ప్రతి మిల్లీ సెకండ్ ను​కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 2024 సంవత్సరంలో ఇప్పటివరకూ నిర్వహించిన ఐర్లాండ్​ జాతీయస్థాయి బిఎంఎక్స్​పోటీలో రెండోస్థానంలో ఉన్నాడు దేవాన్ష్​. 2023లో గ్లాస్కోలో జరిగిన బిఎంఎక్స్​రేసింగ్​ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో మొదటిసారిగా పొల్గొన్నాడు దేవాన్ష్​. అతని ప్రతిభ చూసిన ఐర్లాండ్​ ప్రధానమంత్రి ఎంతో ముచ్చట పడ్డాడు.. అభినందనలు తెలిపాడు.  అంతేకాదు దేవాన్ష్​చూపిస్తోన్న అసాధారణ ప్రతిభను గుర్తించిన ఐర్లాండ్​ బీఎంఎక్స్​ నిర్వాహకులు, అతనికి జాతీయ స్థాయి బెస్ట్​ న్యూకమర్ అవార్డును అందించారు.

డెక్కన్​ క్లబ్​ ఆఫ్​ ఐర్లాండ్​ సంస్థ తరఫున యంగ్​టాలెంట్​ అవార్డును కూడా అందుకున్నాడు దేవాన్ష్​. ఇతను సైక్లింగ్​లోనే కాదు.. మరిన్ని విషయాల్లో కూడా మేటిగానే ఉన్నాడు. దేవాన్ష్​ గతంలో కాన్ఫిడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ కమ్యూనిటీస్​ ఇన్​ ఐర్లాండ్​స్టూడెంట్​ ఆఫ్​ది ఇయర్, డెక్కన్​ క్లబ్​ఆఫ్​ ఐర్లాండ్​యంగ్​ టాలెంట్​ అవార్డు, ఫెడరేషన్​ఆఫ్​ ఇండియన్​ కమ్యూనిటీస్​ ఇన్​ ఐర్లాండ్​తరఫున ఎక్సప్షనల్​అచీవ్​మెంట్​ అవార్డు, స్పిరిట్​ ఆఫ్​ ద స్కూల్​ అవార్డులను అందుకుని.. తనో ఆల్​రౌండర్​ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు మే 28 నుండి జూన్​ 2 వరకు ఇటలీ, వెరొనాలో యుఈసీబీఎం ఎక్స్​వారు నిర్వహించే యూరోపియన్​ఛాంపియన్​షిప్ లో కూడా దేవాన్ష్​ స్థానం సంపాదించుకున్నాడు. 

ఒత్తిడిని జయిస్తూ..
చిన్న చిన్న పరీక్షలకే ఒత్తిడికి గురవుతుంటాం.. కేవలం కొద్ది నెలల శిక్షణతోనే..  ప్రపంచ ఛాంపియన్​షిప్​లో పాల్గొనాలంటే ఎంత ఒత్తిడిని ఉంటుందో చెప్పక్కరలేదు.. అలాంటి ఒత్తిడిని తల్లిదండ్రుల సాయంతో జయించేశాడు దేవాన్ష్​. మొదట్లో తనతో పోటీపడేవారు ప్రదర్శించే ప్రతిభ చూసి బాగా ఒత్తిడికి గురయ్యేవాడట దేవాన్ష్​. వాళ్లలా చేయలేకపోతున్నాను అనేవాడట.. అలాంటి సమయంలో అతని తల్లిదండ్రులు అండగా నిలిచారు. నువ్వు గెలవకపోయినా పర్వాలేదు కానీ.. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి.. ఓడిపోతానని సైక్లింగ్​ చేయకు.. గెలవడానికి ప్రయత్నించు.. అదీ చాలా జాగ్రత్తగా పూర్తిచెయ్యి.. అంటూ పదే పదే చెప్పేవారు. దాంతో దేవాన్ష్​తన ప్రయత్నంపై దృష్టి సారించి.. ఒత్తిడిని జయించేవాడు.   

చిన్న చిన్న టార్గెట్స్​పెట్టుకుని వాటిని పూర్తి చేసేవాడు.. కానీ జీవితంలో మాత్రం దేవాన్ష్​ చాలా పెద్ద టార్గెట్టే పెట్టుకున్నాడు. ఒలంపిక్స్ లో పాల్గొనాలనేది అతని కల అయితే.. భారతదేశ యువతను సైక్లింగ్​వైపుగా ప్రోత్సహించాలనేది అతని ఆశయం. జనాభా తక్కువగా ఉండే ఐర్లాండ్​వంటి దేశాల్లోనే సైక్లింగ్​ విస్తృతంగా ఉంటే.. అత్యంత జనాభా కలిగిన భారతదేశంలో సైక్లింగ్​ క్రీడ లేకపోవడం బాధాకరం.. అందుకే ఆ బాధ్యతను తాను నిర్వహించడానికి మొగ్గు చూపుతున్నాడు దేవాన్ష్​.. భారతదేశ యువతకి సైక్లింగ్​పట్ల అవగాహన పెంచి,  ప్రపంచ సైక్లింగ్​లో వారు ప్రాతినిధ్యం వహించడానికి మార్గాలను వేయడమే తన ఆశయం అని చెబుతున్నాడు ఈ బుడ్డోడు. చదువుపరంగా ఆటోమొబైల్​ ఇంజినీరింగ్​ చేయాలనుకున్న దేవాన్ష్..  చిన్నవయసులోనే నిష్కల్మషమైన ఆశయాన్ని తలకెత్తుకున్నాడు. 
సౌత్​కరోలినాలో జరుగుతున్న ప్రపంచ సైక్లింగ్​ పోటీల్లో, ఇంకా ఇటలీలో జరగనున్న యురోపియన్​ ఛాంపియన్​షిప్​లో కూడా ప్రతిభ కనబరచాలని ఇటు సొంత గ్రామ వాసులు, అటు ఐర్లాండ్​ వాసులు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా అతను అనుకున్న కలలు నెరవేరాలని, మన భారతీయ బిడ్డ ప్రపంచ ఛాంపియన్​ షిప్​ను సాధించాలని కోరుకుంటూ..

ఆల్​ ది బెస్ట్​ దేవాన్ష్​. 
– ఎస్​. ఎన్​. ఉమామహేశ్వరి

ప్రపంచవ్యాప్తంగా సైక్లింగ్​ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. 1969, జూన్​ 10న ఒక రేస్​గా మొదలై.. ప్రపంచంలోని నలుదిక్కులా విస్తరించింది సైక్లింగ్​. ఐర్లాండ్​లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ గా స్థిరపడ్డ రోస్​మాక్లెర్​సైక్లింగ్​ను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చాడు. 1969 కాలిఫోర్నియాలో ఒక పార్కు అటెండెంట్​గా పనిచేసిన రోస్​ కృషితో ఇది రేసింగ్​ పతక క్రీడగా మారింది. దీనికి యునైటెడ్​స్టేట్స్​కు చెందిన శాంక్షనింగ్​బాడీ ద్వారా ధృవీకరణ కూడా లభించింది. అలాంటి సైక్లింగ్​పై, భారతదేశ యువతకు అవగాహన కల్పించి.. దానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాడు దేవాన్ష్​. ఒలంపిక్​ స్థాయిలో ఉన్న ఈ క్రీడను మన దేశ నలువైపులా విస్తరించాలని.. ఈ క్రీడలో మన భారతదేశ యువత ప్రపంచ పోటీలో ప్రాతినిధ్యం వహించడానికి అందరికీ అవగాహన కల్పించి తన వంతు కృషి చేస్తూ.. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాడు  దేవాన్ష్​. అతని ఆశయం నెరవేరాలని కోరుకుందాం..