విజిలెన్స్ డీజీపీ మేడిగడ్డ సందర్శన
- విజిలెన్స్ చేతిలో హార్ట్ డిస్క్ లు
మహాదేవపూర్, ముద్ర: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండవ రోజు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డిజిపి రాజీవ్ రతన్ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన అనంతరం కాసేపు విలేకరులతో మాట్లాడారు. క్రిందటి రోజు విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డిజిపి రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో అన్నారం బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయం తెలిసిందే. అన్నారం బ్యారేజీని మేడిగడ్డ బ్యారేజీని కన్నెపల్లి పంప్ హౌస్ ను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించినట్టు రాజీవ్ రతన్ తెలిపారు. పరిశీలనలో అన్నారం బ్యారేజీ కంటే మేడిగడ్డ బ్యారేజీలో భారీ నష్టం జరిగిందని తెలిపారు. రికార్డుల పరంగా, పనుల పరంగా అన్నారం బ్యారేజీని మేడిగడ్డ బ్యారేజీని పోల్చుతూ విచారణ చేపట్టినట్లు తెలిపారు.
వారం రోజుల క్రితమే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు సంబంధించిన పూర్తి రికార్డులను, హార్డ్ డిస్క్ లను తమ బృందం స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే మళ్లీ క్షేత్ర పరిశీలనకై వివిధ కోణాలలో పరిశీలించి విచారించడానికి వచ్చినట్టు డీజీపీ రాజీవ్ రతన్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందజేయడం జరుగుతుందని తదుపరి చర్యలు ప్రభుత్వమే చేపడుతుందని అన్నారు.