సమస్యలను కలెక్టర్ పట్టించుకోవట్లే..

సమస్యలను కలెక్టర్ పట్టించుకోవట్లే..
  • పింఛన్లలో అడ్డగోలు అవకతవకలు..
  • ఫిర్యాదు చేసి ఏడాదికావస్తున్న కానరాని స్పందన..
  • అధికారుల అలసత్వంపై 'ఛీ'దరించుకుంటున్న ప్రజలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ జిల్లాను గాడిలో పెట్టాల్సిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను బుట్ట దాఖలు చేస్తున్నారు. ఎంతో నమ్మకంతో వివిధ ప్రాంతాల నుండి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ ను ఆశ్రయిస్తే వారి సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నారు. ఆయా మండలాల్లో అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన బాధితులు జిల్లా కలెక్టర్ ను నమ్ముకుంటే కూడా పరిస్థితులు అలాగే ఉండడంతో జిల్లాలోని ప్రజలు ఇంకెక్కడికెళ్తే తమకు సరైన న్యాయం జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, విచారణ జరిపి తగు పరిష్కారం చూపించాల్సిన జిల్లా కలెక్టర్ ఆ వైపు చర్యలేమి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం పట్ల జిల్లాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కలెక్టరే ఇలా నిర్లక్ష్యం చేస్తే ఎలా అంటూ జనం 'ఛీ'దరించుకుంటున్నారు. దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుకున్న చందంగా జిల్లాలో పరిస్థితి తయారయింది. అధికారుల అలసత్వానికి అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందకుండా పోతున్నాయి. మధ్య దళారుల కారణంగా అనర్హులు దర్జాగా ప్రభుత్వ ఫలాలను అందుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వం అందించే ఫించన్లు పక్కదారి పడుతున్నాయి. మధ్య దళారుల ప్రమేయంతో ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి ఫించన్లు పొందుతున్నారు. దీనిపై జిల్లాలోని చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన సుమారు 20 మంది యువకులు, పెద్దలు కలిసి సుమారు ఏడాది క్రితం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాకు ఫిర్యాదు చేశారు. ఫించన్లలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని, అనేకమంది అడ్డదారుల్లో ఫించన్లు పొందుతున్నారని, ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారుల తప్పిదానికి అర్హులకు అందరికీ ఫించన్లు అందకపోగా, అనేకమంది అనర్హులకు మాత్రం పింఛన్లు మంజూరు అయ్యాయని విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని వివరించారు. కొంతమంది మధ్య దళారులు అమాయక ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసి ఫేక్ సదరం సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగిందని, దానితో వైకల్యం లేనివారికి ఫించన్లు మంజూరయ్యాయని, విచారణ జరిపి వాటిని తొలగించి అర్హులైన లబ్దిదారులకు ఫించన్లు మంజూరు చేయాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అందిన ఫిర్యాదుతో విచారణ జరిపి అర్హులకు న్యాయం చేస్తామని హామి ఇచ్చిన కలెక్టర్, ఏడాది కావస్తున్నా ఇంతవరకు పట్టించుకోలేదు. ఇచ్చిన ఫిర్యాదు బుట్ట దాఖలైంది. ఏ విచారణ చేయలేదు. ఎలాంటి న్యాయం జరుగలేదు. దీంతో ఫిర్యాదుదారులు అసంతృప్తికి లోనవుతున్నారు.

సమస్యలపై స్పందించి పరిష్కరించాల్సిన కలెక్టర్ ఆవైపు చర్యలేమి తీసుకోకపోవడం పట్ల నిరుత్సాహానికి గురవుతున్నారు. జిల్లాలో ఇంకా అనేక సమస్యల మీద బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు జిల్లాలో సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేనట్లయితే ప్రజలు విశ్వాసనీయతను కోల్పోతారని మేధావివర్గాలు అభిప్రాయపడుతున్నారు.

ధరఖాస్తు చేసుకున్నా ఫించన్ రావట్లేదు.. - తడుక కొమురమ్మ, గోపాలపురం

ఏడాది నుండి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఫించన్ రావడం లేదు. ఏడాదిన్నర క్రితం నా భర్త తడుక కనకరాజ్యం తాటి చెట్టు పై నుండి పడి చనిపోయాడు. అధికారుల నుండి ఎలాంటి సాయం అందకపోగా, వితంతు ఫించన్ కోసం దరఖాస్తు పెట్టుకుని ఏడాది గడిచినప్పటికీ, ఇంతవరకు ఫించన్ మంజూరు కావడం లేదు. ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఫించన్ మంజూరు చేయాలి.