రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గాజర్ల అశోక్..

రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గాజర్ల అశోక్..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు గురువారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే తన సహచరులు, అనుచరులతోపాటు వివిధ వర్గాల వారితో సంప్రదింపులు జరిపిన అశోక్‌ వారి సూచనల మేరకు కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు. ఆయన పార్టీ లోకి రావడం మూలంగా పార్టీలో చేరికలు ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి వరంగల్‌ జిల్లాలో ఇప్పుడు గాజర్ల అశోక్‌ కాంగ్రెస్‌ చేరడం సంచలనంగా మారింది.

పరకాల ‘కాంగ్రెస్‌’ అభ్యర్థిగా నిలిచేందుకు సన్నాహాలు..

త్వరలో జరుగనున్న శాసనసభ ఎన్నికలలో భాగంగా పరకాల కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలిచేందుకు గాజర్ల అశోక్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఆనాటి రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన పరకాల స్థానం నుంచి ‘బరి’లో నిలిపేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలియడంతో పరకాల ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి రేగుతోంది. ఇప్పటికే పరకాల స్థానం కోసం మాజీ ఎంఎల్‌సి కొండా మురళీధర్‌రావు, నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న ఇనగాల వెంకట్రామిరెడ్డిలు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్న తరుణంలో ఏకంగా పార్టీ అధిష్టానం అశోక్‌పై దృష్టి సారించడం ఆసక్తికరంగా మారుతోంది. సహజంగానే పోరాటాలకు నిలయంగా ఉండే పరకాల స్థానం నుంచి అశోక్‌ను బరిలో నిలపడం ద్వారా పొరుగున ఉన్న భూపాలపల్లి, ములుగు, మంథని, నర్సంపేట నియోజకవర్గాలలో కూడా బలం పెరిగే అవకాశమున్నట్లు పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.