పార్టీ మారుతా(ఉంటా)రా..?

పార్టీ మారుతా(ఉంటా)రా..?
  • అధికార పార్టీ కౌన్సిలర్ల అడుగులు ఎటువైపు..
  • పార్టీ మారే యోచనలో కొందరు కౌన్సిలర్లు

రామకృష్ణాపూర్, ముద్ర : రాబోయే కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీలోనీ ప్రజా ప్రతినిధులు,నాయకులు పార్టీలో ఉంటా(మారుతా)రా..? అనే సందేహం లేకపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసిన పోట పోటీగా చేరికల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొందరు అసంతృప్తి నేతలు పార్టీని వీడి ఇతర పార్టీలో చేరుతున్నారు. రోజు రోజుకు పార్టీ మారి చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఏళ్ల తరబడి పార్టీ కోసం పని చేస్తున్న వారికి కనీస విలువలు దొరకడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తగిన గుర్తింపు లభించకపోవడంతో పార్టీ మారే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే అధికార పార్టీకి రాబోయే ఎన్నికల్లో నష్టం తప్పదనే మాటలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలపై రామకృష్ణాపూర్ "ముద్ర'' రిపోర్టర్ అందిస్తున్న ప్రత్యేక కథనం..

మున్సిపాలిటీ ప్రయాణం ఇలా సాగింది..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019 లో నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలలో చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన పల్లి మున్సిపాలిటీ ఒకటి. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీలో మొత్తంగా 22 వార్డులను ఎంపిక చేసి టి(బీ)ఆర్ఎస్ నుంచి 22 మంది అభ్యర్థులను ఖరారు చేసి బరిలో దింపారు. జరిగిన ఎన్నికల్లో 17 వార్డులలో పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. అభ్యర్థుల ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపాలిటీలో పాలనను  కొనసాగించారు. గెలుపొందిన ప్రజా ప్రతినిదులు దిగ్విజయంగా మూడు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నారు. 

కౌన్సిలర్ల అడుగులు ఎటువైపు..

మున్సిపాలిటీలో పోటీ చేసి ప్రస్తుతం కౌన్సిలర్లుగా కొనసాగుతున్న ఆ ప్రజా ప్రతినిధులు గత కొద్ది రోజులుగా తమ అడుగులు ఎటువైపు వెయ్యలనే ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తుంది. పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు పోటీకి రెడీ అయ్యి ఎన్నికల సమయంలో అప్పులు తెచ్చి ఖర్చు చేసి కౌన్సిలర్లుగా విజయం సాధించారు. గెలుపు కోసం తెచ్చిన అప్పుకు ఇప్పటివరకు అసలు,వడ్డీ చెల్లించకపోవడంతో గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. బంగారాన్ని బ్యాంక్ లో కుదువపెట్టి మరి తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నారు. ఎలాంటి ఆదాయం లేకపోవడంతో కుటుంబ పోషనే  భారంగా మారింది.అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న కొందరు కౌన్సిలర్లు వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలు ఇచ్చే భారీ అఫర్లకు పార్టీ మారే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన నాయకులతో దగ్గరి సంబంధాలు పెట్టుకోగా ఒక పార్టీకే మొగ్గు చూపుతు అడుగులు వేసేందుకు సిద్దంగా ఉన్నారనేది విశ్వనియ సమాచారం. పార్టీలు ఇచ్చే ఆఫర్లకు, ఆహ్వానాలకు బెండై పార్టీ మారితే అధికార పార్టీకి ఎన్నికల వేళ తీవ్ర నష్టం జరుగుతుందనే చర్చ పట్టణంలో ఈ మధ్య వినిపిస్తుంది. అధికార పార్టీ కౌన్సిలర్లు పార్టీ మారుతా(ఉంటా)రా..? అనేది వేచి చూడాల్సిందే.